Mansoor Ali Khan : తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నటి త్రిషపై మన్సూర్ చేసిన కొంట్రవర్సీ కామెంట్స్ పై చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, నెటిజెన్స్, త్రిష అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మన్సూర్ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో త్రిష కూడా ఘాటుగానే స్పందించింది. సోషల్ మీడియా పేజీలో మన్సూర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడిన మన్సూర్ తో మళ్ళీ కలిసి నటించేది లేదని చెప్పేసింది త్రిష. అంతేకాదు అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ త్రిష కు సపోర్టుగా నిలిచారు. నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సోషల్ మీడియాలో మన్సూర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే మొదట్లో తను తప్పుగా మాట్లాడలేదని త్రిష కు సారీ చెప్పేది లేదని మన్సూర్ తెలిపారు. అంతేకాదు తమిళనాడు డీజీపీకి, జాతీయ మహిళా కమిషన్ కు మన్సూర్ పై ఫిర్యాదు చేశారు. చెన్నై పోలీసులు మన్సూర్ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ విషయం సీరియస్ కావడంతో పంతం వీడి త్రిషకు క్షమాపణలు చెప్పారు.’తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. త్రిష ఆ సారీ ని యాక్సెప్ట్ చేసి అక్కడితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ మన్సూర్ మరో రచ్చ మొదలుపెట్టాడు.
తాజాగా ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై మన్సూర్ పలు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు . పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, రెచ్చగొట్టడం వంటి కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ ప్రకటించారు. కొన్ని ఆధారాలతో తన లాయర్ గురు ధనంజయన్ సోమవారం కోర్టులో కేసు వేయనున్నట్లు చెప్పారు. ఖుష్బు, త్రిష, చిరంజీవిలకు నోటీసులు జారీ చేస్తానని ప్రకటించారు.మరి ఈ వివాదం మళ్లీ ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.