Tue. Jan 20th, 2026

    Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నాడు అనే విషయంపై తాజాగా ఒక స్పష్టత ఇచ్చేసాడు. తూర్పు గోదావరి పర్యటన ముగించుకొని మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. తమ బలం ఎంత అనేది చూసుకొని పొత్తుల విషయంలో డిమాండ్ ఉంటుందని అన్నారు. గత ఎన్నికలలో 130కి పైగా స్థానాలలో పోటీ చేసాం. కనీసం 30 స్థానాలలో అయిన గెలిపించి ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే స్థాయిలో జనసేన బలం ఉండేది. కాని గెలవలేకపోయాం. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే జనసేన బలం ఈ సారి కచ్చితంగా రెట్టింపు అయ్యిందని చెప్పగలను.

    అలాగే తమ ఉనికి ఉన్న నియోజకవర్గాలలో అయితే 30 నుంచి 35 శాతం ఓటింగ్ ఓటింగ్ ఉంది. ఎవరేజ్ గా చూసుకున్న 18 శాతం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం ఉంది. ఈ బలంతో పొత్తుల విషయంలో తమ గౌరవం తగ్గకుండా ఎలా వెళ్తే బాగుంటుంది అనే విషయాలపై చర్చించిన నిర్ణయం ఉంటుంది. అలాగే ఈ సారి జనసేన నుంచి బలమైన సంఖ్య అసెంబ్లీలో అడుగుపెట్టడంపైన తమ దృష్టి ఉంది. అదే సమయంలో పొత్తుల ద్వారా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాట చెప్పడం జరిగింది. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే, తమ పనితనం బాగుందని ప్రజలు భావిస్తే పదవులు వాటికవే వస్తాయి. పదవుల కోసం నేను రాజకీయం చేయడం లేదు.

    ప్రజల కోసమే చేస్తున్నా, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పొత్తులతో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు సలహాలు ఇస్తున్న ఎవరూ కూడా జనసేనకి ఓటు వేసిన వారు కాదు. నాకు అండగా నిలబడిన వారు కాదు. నాతో నడిచే వారే నావారు అని విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. అలాగే బీజేపీని పొత్తు విషయంలో లెక్కలు చూపించి మరీ ఒప్పించే ప్రయత్నం చేస్తానని కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. అలాగే సీఎం పదవిని డిమాండ్ చేసే స్థాయిలో మన బలం లేదని పవన్ కళ్యాణ్ ఈ మీడియా సమావేశంలో చెప్పేశారు.