Sun. Jun 14th, 2026
    Andhra Pradesh: బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని’ బ్రాండ్‌కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆ పేరు వినబడితే చాలు.. రాజకీయ రణరంగమే గుర్తొస్తోంది. ఒకప్పుడు వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ ఒకరికొకరు అండగా నిలిచిన కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. నిన్నటివరకు మాటల తూటాలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైన ఈ అన్నదమ్ముల సవాల్.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.

    గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీల తరపున తలపడటంతోనే అసలు కథ మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా తమ్ముడు చిన్ని, వైసీపీ అభ్యర్థిగా అన్న నాని విజయవాడ ఎంపీ సీటు కోసం హోరాహోరీగా పోటీ పడ్డారు. ఆ పోరులో తమ్ముడి చేతిలో అన్న ఘోర పరాజయం పాలయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది దాటుతున్నా వీరి మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత విభేదాలు మాత్రం చల్లారలేదు సరే కదా.. మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆస్తులు, వ్యాపారాలు, బినామీ వ్యవహారాల చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం తాజాగా మరో మలుపు తిరిగింది.

    andhra-pradesh-kesineni-vs-kesineni-nani-cornered-by-chinnis-move
    andhra-pradesh-kesineni-vs-kesineni-nani-cornered-by-chinnis-move

    Andhra Pradesh: మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ఆరోపణలు

    ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ఆరోపణలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ‘ఉర్సా క్లస్టర్స్’ అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నాని విడుదల చేసిన ఒక బహిరంగ లేఖ తీవ్ర దుమారం రేపింది. బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారంటూ అన్న చేసిన ఆరోపణలపై తమ్ముడు చిన్ని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చినా నాని తీరు మారకపోవడంతో, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు.

    చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ పటమట పోలీసులు రంగంలోకి దిగారు. కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఐటీ యాక్ట్ కింద అత్యంత కఠినమైన క్రిమినల్ సెక్షన్లను నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న నానికి.. తమ్ముడు చిన్ని లీగల్ రూట్‌లో ఇచ్చిన ఈ షాక్ బెజవాడ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది. మరి ఈ బ్రదర్స్ వార్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.