TTD: తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఇక స్వామివారిని దర్శించడం కోసం వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దర్శనం విషయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలను జారీ చేసింది. స్వామి వారి దర్శనం కోసం విడుదల చేసే విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా తెలియజేసింది. తిరుమలలో స్వామివారికి నిర్వహించే వివిధ రకాల ఉత్సవాలు పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 3 నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. మరి ఏ ఏ తేదీలలో ఎలాంటి ఉత్సవాలు జరగబోతున్నాయి అనే విషయాలను కూడా టీటీడీ వెల్లడించింది.జులై 14వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 17 వ తేదీ ఆణివార ఆస్థానం,జూలై 19 శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద,జూలై 29 జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం నిర్వహించబడుతుంది. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో విఐపి దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది.

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
ఇక ఆగస్టు నెలలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలను స్వామివారికి నిర్వహించబోతున్నారు అందుకు సంబంధించిన వివరాలను కూడా టీటీడీ తెలియజేసింది.ఆగస్టు 22 పవిత్రోత్సవాలకు అంకురార్పణ,ఆగస్టు 24 పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ,సెప్టెంబర్ 8 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,సెప్టెంబర్ 14 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్ 15 నుండి 23 వరకు: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. పైన తెలిపిన ఈ తేదీలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిర్దేశిత రోజులకు ముందు రోజు తిరుమలలో ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు కావున తిరుమల వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

