Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం ‘సేమ్ టు సేమ్’ అనిపిస్తోంది. ఒకప్పుడు అధికార పీఠంపై కూర్చుని రెండు తెలుగు రాష్ట్రాలను శాసించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు విపక్ష స్థానానికే పరిమితమయ్యారు. అయితే, ఓటమి తర్వాత ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల అధినేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వారి బాడీ లాంగ్వేజ్, భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే.. ఇద్దరూ ఒకే స్క్రిప్ట్‌ను ఫాలో అవుతున్నారా అనే అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఓడిపోయిన పార్టీలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ మొహం చూసింది లేదు. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ కూడా అదే బాట పట్టారు. మైకులు ఇవ్వడం లేదనో, ప్రతిపక్ష హోదా దక్కలేదనో కారణాలు ఏవైనా.. ఇద్దరు టాప్ లీడర్లు చట్టసభలకు దూరంగా ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్. మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతామనే బలమైన సంకేతాన్ని ఇద్దరూ తమ క్యాడర్‌కు పంపుతున్నట్లు కనిపిస్తోంది.

Politics: ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అసెంబ్లీకి నో చెప్పిన ఈ నేతలు.. జనం మధ్యకు వెళ్లేందుకు మాత్రం ఒకే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇరు రాష్ట్రాల్లో పాదయాత్రలే శరణ్యమని నమ్ముతున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు ఒకే సమయంలో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం. సభల్లో మాట్లాడేదానికంటే, నేరుగా జనం గుండెల్లోకి దూసుకుపోవడమే 2029 టార్గెట్‌కు సరైన రూట్ అని ఇరు పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి.
అయితే, ఈ ఇద్దరు నేతల సరికొత్త పొలిటికల్ ఫిలాసఫీ ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సమస్యల మీద తక్షణ పోరాటాలు చేసి, ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారాలు సాధించడం పాత పద్ధతి అన్నట్లుగా వీరి వైఖరి ఉంది. బాధితులు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే.. “మరో రెండేళ్లు/మూడేళ్లు ఓపిక పట్టండి, మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తాం” అంటూ భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో జగన్ ఇస్తున్న స్టేట్‌మెంట్లు దీనికి అద్దం పడుతున్నాయి. మరి, “అధికారంలోకి వస్తేనే న్యాయం” అనే ఈ సరికొత్త విపక్ష ఫార్ములా 2029లో వీరికి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

