Politics: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలనే రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్సాహాన్ని తప్పుపట్టలేం కానీ, ఆ ఉత్సాహం కాస్త అతిగా మారుతోందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌గా దూసుకుపోతున్న గచ్చిబౌలి పరిధిలోని అమెరికన్ కాన్సులేట్ ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాజకీయ, దౌత్య వర్గాల్లో పెను దుమారమే రేపుతోంది. జూన్ 23న జరగబోయే ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కానీ, అసలు ఈ టైంలో ట్రంప్ భజన రేవంత్ సర్కార్‌కు అవసరమా? అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం శాశ్వతంగా ఉండాలి. అమెరికా అంతర్గత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన, విభజన రేఖలు గీసిన నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు పేరుంది. కేవలం డెమొక్రాట్లు మాత్రమే కాదు, ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ఒక వర్గం, మెజారిటీ అమెరికన్ పౌరులు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ ప్రపంచాన్ని తిప్పలు పెట్టిన ఒక నాయకుడి పేరును, అది కూడా దౌత్య కార్యాలయం ఉన్న రోడ్డుకు పెట్టడం ద్వారా రేవంత్ సర్కార్ అమెరికాలోని ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెగెటివ్ సిగ్నల్స్ పంపినట్లవుతోంది.

Politics: రేవంత్ సర్కార్ ఈ రూట్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది
హైదరాబాద్ నేడు కాస్ట్‌కో, ఎలి లిల్లీ, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫార్చ్యూన్ 500 అమెరికన్ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి, అమెరికా అధికార యంత్రాంగాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ సర్కార్ ఈ రూట్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వ్యాపారాలను ఆకర్షించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల పేర్లు వాడితే ఒక అర్థం ఉంది కానీ, అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఒక రాజకీయ నేత పేరును శాశ్వతం చేయాలని చూడడం ఎంతవరకు సమంజసం?
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు (జూలై 4) ముందే ఈ నామకరణాన్ని అధికారికం చేసి పెద్ద స్కెచ్చే వేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఈ నిర్ణయాన్ని పక్షపాత రహితంగా ఉండే సగటు అమెరికన్లు గానీ, అక్కడి ప్రస్తుత అధికార యంత్రాంగం గానీ పూర్తిగా స్వాగతించే అవకాశం లేదు. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా రాజకీయ పరిణామాలు మారి, ట్రంప్ వ్యతిరేక వర్గం అధికారంలోకి వస్తే, ఈ ట్రంప్ అవెన్యూ బోర్డు చూసి వారు ఎలా స్పందిస్తారనే కనీస ఆలోచన రేవంత్ సర్కార్ చేయకపోవడం గమనార్హం.
ఏదేమైనా పెట్టుబడుల కోసం, బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ, ఒక వివాదాస్పద విదేశీ నేత వ్యక్తిగత బ్రాండ్‌ను మోయడానికి హైదరాబాద్ ఐకానిక్ రోడ్లను వాడుకోవడం ఖచ్చితంగా వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ట్రంప్ భజన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటేనే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రతిష్టకు మంచిది.

