Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు ఉంటాయి. రాం గోపాల్ వర్మ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆయన తీసే సినిమాలన్నీ వాస్తవిక సంఘటనలతో ముడిపడి ఉంటాయి. పూరి జగన్నాధ్ సినిమా అంటే హీరో పక్కా మాస్ అవతారం ఎత్తుతాడు. మహేశ్ బాబు లాంటి క్లాస్ హీరోతో కూడా పోకిరి లాంటి మాస్ సినిమా తీసి బిజినెస్‌మేన్ ని చేయగలరు.
ఇక దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, బాపు-రమణ, శేఖర్ కమ్ముల, వంశీ..ఇలా ఒక్కొక్కరు తమ సినిమాలతో తమదైన శైలిని చాటుకున్నారు. అలాంటి వారికి కాస్త భిన్నంగా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు విరించి వర్మ. సినిమా అంటే పక్కా కమర్షియల్ అని చెప్పుకుంటున్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ‘ఉయ్యాలా జంపాలా’ అంటూ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో అందమైన ప్రేమకథను చూపించి శభాష్ అనిపించుకున్నారు.
Virinchi Varma: నా వయసు గనక తక్కువైతే ఇందులో నేనే హీరోగా చేసేవాడిని..
అక్కినేని నాగార్జున గారు సైతం ఈ సినిమా చూసి నా వయసు గనక తక్కువైతే ఇందులో నేనే హీరోగా చేసేవాడిని అన్న మాటను విరించి వర్మ ఎప్పటికీ మర్చిపోలేడు. అంతేకాదు..ఉయ్యాల జంపాల సినిమాలో ముందు హీరోగా చేయాల్సింది నేచురల్ స్టార్ నాని. కొన్ని కారణాల వల్ల ఆయన మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ట్రైలర్, రష్ చూసి మంచి సినిమా.. క్యూట్ లవ్‌స్టోరీ..మిస్ అయిన ఫీలింగ్ ని ఎక్స్‌ప్రెస్ చేసిన సందర్భమూ ఉంది.
ఆ తర్వాత నాని, విరించి కలిసి మజ్ఞు సినిమా చేసి హిట్ కొట్టారు. ఆ తర్వాత విరించి నుంచి మళ్ళీ ఎలాంటి సినిమా వస్తుందో అని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ లో విరించి మూడు నాలుగు సినిమాలను పూర్తి చేయాల్సింది. కానీ, ప్రతీ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల సెట్స్ వరకూ వచ్చి ఆగిపోయాయి.
Virinchi Varma: జితేందర్ రెడ్డి సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎట్టకేలకి జితేందర్ రెడ్డి సినిమాతో ఈ నెల 8వ తేదీన థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో నిమగ్నమై ఉన్నారు టీమ్ అంతా. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు విరించి వర్మ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మొదటిసారి జోనర్ మార్చి సినిమా తీసినప్పటికీ ఆయన్ని బాగా కదిలించిన ఓ లీడర్ కథను తెరపైకి తీసుకురావడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు.
1980 కాలంలో కరీంనగర్, జగిత్యాల చుట్టుపక్కల జిల్లాలను ప్రభావితం చేసిన యదార్థ సంఘటనల ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించగా..రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
కాగా, ఇక నానుంచి వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విరించి వర్మ తెలిపారు. ఏ కథ అయినా ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఉంటూ..ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సినిమా ఉంటుందని వివరించారు. జితేందర్ రెడ్డి సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్ ఒక్కటే ఒకెత్తుగా ఉంటుందని..సినిమా చూసిన ఆడియన్స్ బరువెక్కిన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తారని అదే అమోషన్ లో కొద్దిసేపు ఉండిపోతారని చెప్పారు. త్వరలోనే ఆయన కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్రయతిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తాజా చిత్రం జితేందర్ రెడ్డి సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.