Uttarakhand : హిందువులు చేసుకునే ప్రతి పండుగకు ఒక పురాణ కథ ఉంటుంది. ప్రతి సంవత్సరం సోదరీ, సోదరులు జరుపుకునే రాఖీ పండుగకు కూడా ఎన్నో కథలు పురాణాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ బలిచక్రవర్తికి శ్రీ మహాలక్ష్మి రాఖీ కట్టడం. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేయాలని శ్రీ మహా విష్ణువు వామనుని అవతారం ఎత్తాడు. ఆ తర్వాత బలిచక్రవర్తిని తన ద్వారపాలకుడిగా చేస్తానని శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేస్తాడు. అయితే ఇంతలో తన భర్త అయిన మహా విష్ణువుని తిరిగి వైకుంఠానికి తీసుకురావాలని శ్రీ మహాలక్ష్మీ కోరుకుంటుంది. అప్పుడు నారద ముని.. కలుగచేసుకుని బలికి రక్షా బంధన్ కట్టమని లక్ష్మీదేవికి సలహా ఇచ్చాడు . ఆలా వామన అవతారం పూర్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవితో కలిసి వైకుంఠానికి పయనమయ్యాడు. అలా వామన అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా మారిన తర్వాత తన తొలి అడుగుపెట్టిన ప్రదేశమే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా ఉర్గామ్ లోయ.
శ్రీ మహావిష్ణువు అలకనందానది ఒడ్డున బన్షీ నారాయణుడిగా కొలువుదీరాడు . ఈ ఆలయం .. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్‌కు అతి దగ్గరగా ఉంది. ఆలయంలో శివుడు, గణేశుడు, వాన్ దేవి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం కేవలం రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆరోజు మాత్రమే ఆలయం ప్రాంగణం భక్తులతో సందడిగా మారుతుంది. రాఖి పర్వదినం రోజున తలుపులు తెరిచి స్వామివారికి పూజలు చేసిన అనంతరం మహిళలు , బాలికలు రాఖీలకు పూజలు చేసి స్వామివారి సన్నిధిలో తమ సోదరులకు రాఖీలు కడతారు. అంతే కాదు రాఖీ పండుగ వేళ భక్తులు ఆలయంలో ప్రసాదం చేస్తారు. ఈ ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రసాదం తయారీ కోసం అవసరమయ్యే వెన్నను ప్రతి ఇంటి దగ్గర నుంచి సేకరించి మరీ భక్తులు ఆలయానికి తీసుకొస్తారు. .. దాంతో ప్రసాదం తయారు చేసి విష్ణువుకు సమర్పిస్తారు.
ఈ వైష్ణవాలయం ఉర్గాం గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి భక్తులు చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణం చేసేవారు.. హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలినడకన వంశీ నారాయణ దేవాలయానికి చేరుకోవాలి. అయితే రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే ఆలస్యం చేయకుండా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.