Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సినీ పరిశ్రమలో తన రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె తన కెరీర్‌లో ఎదురైన కొన్ని వివాదాలపై స్పందించారు. ముఖ్యంగా, ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలో అవంతిక పాత్రకు సంబంధించిన వివాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
బాహుబలి మొదటి భాగంలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా లభించింది. కథలో భాగంగా శివుడు (ప్రభాస్), యోధురాలిగా ఉన్న అవంతిక రూపాన్ని మార్చి, ఆమెలోని స్త్రీత్వపు అందాన్ని బయటకు తీసుకువచ్చే సన్నివేశంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థ దీనిపై “ది రేప్ ఆఫ్ అవంతిక” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. అవంతిక అనుమతి లేకుండా శివుడు ఆమె దుస్తులు మార్చడం, తాకడం అత్యాచారమేనని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈ వివాదంపై తమన్నా స్పందిస్తూ, ఆ సన్నివేశంలో ఏమాత్రం అత్యాచారం లేదని స్పష్టం చేశారు. “ఒక స్త్రీ తన బాహ్య స్వరూపమే కాదు, తన అంతః సౌందర్యాన్ని కూడా గుర్తించుకోవడం ఆ సీన్ ఉద్దేశ్యం. శివుడు అవంతికకు ఆమెలోని అందాన్ని పరిచయం చేసినట్లుగా, దర్శకుడు రాజమౌళి ఆ సన్నివేశాన్ని చాలా అందంగా తెరకెక్కించారు,” అని ఆమె తెలిపారు.

Tamannaah Bhatia: ఈ వివాదానికి తనదైన శైలిలో ముగింపు
అంతేకాకుండా, “గాయపడ్డ ఒక అమ్మాయి తన లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్న సమయంలో, ఆమెలోని స్త్రీత్వపు అందాన్ని తిరిగి గుర్తు చేసే ప్రయత్నమే ఆ సన్నివేశం,” అని రాజమౌళి గారు తనకు ముందుగానే వివరించారని తమన్నా చెప్పారు. “ఒక అమ్మాయి తనను తాను కనుగొనేటట్లు చేసే పురుషుడిని అత్యాచారిగా ఎలా పిలుస్తారు? కొందరు కావాలనే ఆ సీన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజమౌళి గారు అవంతికను ఎక్కడా అవమానించలేదు,” అంటూ తమన్నా ఈ వివాదానికి తనదైన శైలిలో ముగింపు పలికారు.
‘బాహుబలి’ విడుదలై దాదాపు పదేళ్లు అవుతున్నా, ఈ సీన్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తమన్నా ఇచ్చిన ఈ వివరణతో ఈ వివాదం ముగుస్తుందేమో చూడాలి.

