Health: ఇప్పుడు సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు దాదాపు అందరూ వేడి తీవ్రతకు శరీరం డీ హైడ్రట్ అయి నీరసం వస్తుంది. దానివల్ల నీరసం వచ్చి ఒంట్లో ఓపిక లేక ఏ పనీ చేయాలనిపించదు. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ల పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకునే కొన్ని పానియాలు..చలువ చేసే పదార్థాలు ఉపయోగించుకోవడం వల్ల శరీరంలో చాలా వరకు శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చు.
అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలను కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
రాగిజావ: సాధారణంగా గ్రామాలలో ఇంతకముందు రాగులతో తయారు చేసిన సంగటి, జావ తీసుకుంటుంటారు. అయితే, ఇప్పుడు ఇదే రాగులను పిండి చేసి జావగా తయారు చేసి సిటీలలో కూడా అమ్ముతున్నారు. అయితే, రాగులను పిండిగా తయారు చేసి పెట్టుకొని ఎండా కాలం మొదలైనప్పటి నుంచి రోజూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు తీసుకుంటే శక్తి లభిస్తుంది. రాగిపిండిని, మజ్జిగలో ఎక్కువగ కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. దీనిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకున్నా విటమిన్ సి కూడా లభిస్తుంది.
పుదీనా జ్యూస్: మనకు ఎండాకాలం ఎక్కువగా లభించే చలువ పానియాలలో పూదినా జ్యూస్ కూడా ఒకటి. దీనిని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్‌గా దొరికే పూదీనా ఆకును మెత్తగా పేస్ట్ చేసుకొని మంచి నీళ్ళలో కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసాన్ని, ఉప్పును, కొద్దిగా మిరియాల పొడిని కలుపుకొవాలి. ఈ నీళ్ళను మట్టికుండలో రెండు గంటలపాటు ఉంచితే అది చల్లబడుతుంది. ఈ పానియాన్ని రోజులో మూడు నాలుగుసార్లు తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. అలాగే, బాడీ డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు.
సబ్జా గింజలతో పానియం: ఎండాకాలం ఉన్నన్ని రోజులు మన శరీరానికి ఎంతో ఉపయోగకరమైన వాటిలో సబ్జా పానియం ఒకటి. నాలుగు లేదా 5 స్పూన్ల సబ్జా గింజలను రాత్రి మంచి నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం వరకు అవి నీటిలోనాని పానియం తయారు చేసుకునేందుకు తయారవుతాయి. ఈ నీటిలో నిమ్మరసం, పంచదార కలుపుకొని దాహం వేసినప్పుడు తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గడంతో పాటు నీరసం రాకుండా తక్షణ శక్తి లభిస్తుంది. ఆఫీసులకు వెళ్ళే వారు కూడా ఈ పానియాన్ని ఒక బాటిల్‌లో తీసుకొని వెళ్ళి మధ్య మధ్యలో తీసుకోవడం ఎంతో మంచిది.
పండ్లతో తయారు చేసుకున్న పెరుగు అన్నం: సాధారణంగా మనలో చాలా మందికి రోజూ పెరుగన్నం తినే అలవాటు ఉంటుంది. అయితే, సమ్మర్‌లో క్రమం తప్పకుండా పెరుగు అన్నం లేదా మజ్జిగ అన్నం తీసుకోవడం చాలా మంచిది. అయితే, పెరుగు అన్నంలో కొన్ని పదార్థాలను కలుపుకోవడం వల్ల శక్తితో పాటు వేడి తీవ్రత నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండు ముక్కలను కలుపుకొని భోజనంలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. చాలా మంది ఎంత సమ్మర్ అయినా కూడా మసాలా ఫుడ్స్, బిర్యానీ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీని వల్ల రాత్రిళ్ళు వేడి తీవ్రతకు మూత్రం వెళ్ళినపుడు మంటగా అనిపిస్తుంది. అంతేకాదు, ఘాటుగా తేనుపులు వస్తుంటాయి. గొంతులో మంటగా కూడా అనిపిస్తుంటుంది. అందుకే దాదాపుగా సమ్మర్‌లో ఎక్కువ మసాలా కలిపిన ఆహార పదార్థాలను తీసుకోకపోతేనే మంచిది.
సగ్గుబియ్యం పాయసం: ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చే పదార్థాలలో సగ్గుబియ్యం పాయసం ఒకటి. సగ్గుబియ్యాన్ని 5 నుంచి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వాటిని నీటిలో కలుపుకొని స్టౌ మీద సింలో మరగబెట్టుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా అయిన తర్వాత దానిలో పంచదార, పాలు, ఇలాచి, ఖాజు, కిస్‌మిస్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా దగ్గరికి అయ్యాక స్టౌపై నుంచి దించేయాలి. ఆ పదార్థాన్ని కాస్త చల్లబడిన తర్వాత రోజులో మూడు నాలుగుసార్లు కొద్ది కొద్దిగా తీసుకుంటే ఒంట్లో వేడి ఉంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
మజ్జిగ: మనలో ఎక్కువ శాతం మందికి మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. దీనిని సమ్మర్‌లో కాస్త ఎక్కువసార్లు ఉపయోగించుకుంటే దాహం తీరడంతో పాటు ఒంట్లోని వేడి కూడా త్వరగా తగ్గుతుంది. కొంతమందికి మజ్జిగ తాగాలంటే అంతగా ఇష్టపడరు. అలాంటి వారికి మజ్జిగలో కొద్దిగా పూదీనా, కొత్తిమేర ఆకులు కలిపి ఇస్తే ఆ సువాసనతో మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు. ఇలా కలిపిన మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాదు, మజ్జిగలో సన్నగా ఉల్లిపాయ ముక్కలను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి చలువదనం లభిస్తుంది. ఇలాంటి సహజ పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకొని ఎండ తీవ్రత నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.