Spirtual: కార్తీకమాసం ప్రారంభమైంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా దీనిని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగా కార్తీక మాసంలో నెల రోజుల పాటు శివయ్యకి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసుకొని శివాలయానికి వెళ్లి పూజ చేస్తారు. అలాగే రావిచెట్టుకి కూడా కార్తీకమాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్తీకమాసంలో వచ్చే కార్తిక సోమవారం రోజు అయితే శివాలయాలు అస్సలు ఖాళీ ఉండవు.
ముఖ్యంగా స్త్రీలు, సౌభాగ్యం కోసం, వివాహం కావడం కోసం, అలాగే సంతానయోగం కోసం, ఐశ్వర్యం కోసం కార్తీక మాసాన్ని అత్యంత నిష్టతో నిర్వహిస్తారు. ఈ మాసంలోనే భగిని హస్తభోజనం అనే వేడుక కూడా ఉంటుంది. కార్తీకమాసంలో శుక్లపక్ష విదియనాడు ఈ వేడుకని జరుపుకుంటారు. అన్నా చెల్లి, అక్కా తమ్ముడు ఉన్నవారు చేసుకునే వేడుకగా దీనిని చూస్తారు. రాఖీ పౌర్ణిమ తర్వాత హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా దీనిని భావిస్తారు. ఇక ఈ రోజున అన్నయ్యలు, తమ్ముళ్ళు తోబుట్టువుల ఇంటికి వెళ్లి వారి చేతితో వండిన భోజనం తిని వారిని ఆశీర్వదించి బహుమతులు ఇస్తారు.
దక్షిణభారత దేశంలో ఈ వేడుకని తక్కువగా చేసుకున్న ఉత్తర భారతంలో మాత్రం చాలా మంది సోదరసోదరీమణులు చేసుకుంటారు. ఇలా కార్తీకమాసంలో శుక్లపక్ష విదియ నాడు సోదరి చేతితో ఆమె ఇంట్లో భోజనం చేస్తే అకాల మరణం, అపమృత్యు దోషం హరించుకుపోతుందని హిందువుల విశ్వాసం. దీని వెనుక ఒక పురాణ సంబంధ కథ కూడా ఉంది. యమధర్మరాజు సోదరి యమున దేవి అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే యమున వివాహం అయిన తర్వాత సోదరుడిని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేది. అయితే యముడు తన బాధ్యతలలో పడి సోదరి ఇంటికి వెళ్ళలేకపోయేవాడు. అయితే ఒకనాడు అనుకోకుండా యమున ఇంటికి యమధర్మరాజు వెళ్తాడు. అలా వెళ్ళిన రోజు కార్తీకమాసం శుక్లపక్ష విదియ తిది కావడం విశేషం.
ఆ రోజు సోదరి చేతి వంటని కడుపార ఆరగించిన యమధర్మరాజు తనకి సంతృప్తికరమైన భోజనం పెట్టినందుకు ప్రతిగా ఏదైనా కోరుకోమని చెబుతాడు. దీంతో యమునా దేవి సోదరుడితో నీలాగే కార్తీకమాసంలో శుక్లపక్ష విదియ నాడు ఏ సోదరుడు అయితే సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతితో భోజనం చేస్తాడో అలాంటి వారిని కరుణించాలని, అకాల మృత్యువు నుంచి విముక్తి చేయాలని కోరుతుంది. యమధర్మరాజు సోదరి కోరికని మన్నించి అలాగే అని వరం ఇస్తాడు. అప్పటి నుంచి విదియ తిథి రోజున ఎవరైన సోదరి ఇంట్లో భగిని హస్తభోజనం చేస్తారో వారికి దీర్ఘాయుష్షు ఉంటుందనే విశ్వాసం ప్రజలలో ఉంది. దానిని పురాణ కథల ద్వారా విని ఇప్పటికి హిందువులు ఆచరిస్తూ వస్తున్నారు.