Amavasya:నేడు సోమవారం అమావాస్య రావడంతో ఈ అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈ సోమావతి అమావాస్య రోజు ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది కనుక ఈరోజు శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు శివాలయానికి వెళ్లి శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఇక సోమావతి అమావాస్య రోజు ఉదయం తల స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయడం మంచిది అనంతరం బిల్వదలాలతో స్వామిని పూజించడం ఎంతో శ్రేయస్కరం.
ఈ సోమావతి అమావాస్య ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటలు లేదా 9 గంటల నుంచి 10:30 గంటల లోపు చేసుకోవాలి. ఉదయం వీలుకాని వారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవచ్చు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే… సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఇక ఈ అమావాస్య రోజు మౌనవ్రతం కనుక పాటిస్తే వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టుకు 108 ప్రదక్షణలు చేయటం మంచిది. ముఖ్యంగా రావి చెట్టు వేపి చెట్టు ఉన్నటువంటి చెట్లను పూజించి ప్రదక్షణలు చేయటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబ సభ్యులలో సఖ్యత ఉండాలి అంటే ఈ అమావాస్య రోజు నల్ల చీమలకు పంచదారను దానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.