Health: ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. చిన్న వయసులోనే గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. అలాగే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఏమాత్రం అలసటకు గురైన హార్ట్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో మాత్రమే ఈ హార్ట్ స్ట్రోక్ కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో గుండె పోటు సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దైనందిన జీవితంలో రోజువారీ ఆహారపు అలవాట్లు జీవన విధానాల్లో మార్పులు గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి కారణమవుతున్నాయి.
జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి శరీరంలో కణజాల వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే గత రెండేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపెట్టిన కరోనా మహమ్మారి మనుషులలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణించేలా చేసింది. ఈ ప్రభావం కూడా గుండెపోటులు రావడానికి కారణం అయ్యింది. గుండెకు రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీటికి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారాలు లేవు. ముందు జాగ్రత్త చర్యలతోనే కేవలం హార్ట్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే ఇప్పుడు గుండె పోటు సమస్యను పరిష్కరించే సరికొత్త జెల్ ను యూకే శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ జెల్ తో గుండెపోటు సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఒకసారి గుండెపోటు వస్తే హార్ట్ కి రక్తాన్ని పంపిణీ చేసే చాలా కణాలు దెబ్బతింటాయి. వాటిని మళ్లీ ఉత్పత్తి చేస్తే తిరిగి గుండెపోటు సమస్యకి చెక్ పెట్టొచ్చు. దీనిపై చాలా ఏళ్లుగా పరిశోధనలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికి ఒక ప్రయోగం విజయవంతమైంది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కి చెందిన సైంటిస్టులు బయోడిగ్రేడబుల్ జెల్ ను తయారు చేశారు. దీనికి గుండెకు సంబంధించిన కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని శాస్త్రీయంగా రుజువు చేశారు. దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే ఇక గుండెపోటు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. వైద్యరంగంలో ఇదొక అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు.