Technology: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక ఒకప్పుడు మార్కెట్ లో ఏవైనా వస్తువులు కొనాలన్నా కూడా డబ్బులు మాత్రమె చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. చాలా వరకు ఈ డిజిటల్ పేమెంట్ ద్వారానే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే క్రెడిట్ కార్డు వినియోగం కూడా బాగా పెరిగింది. అత్యవసర సమయాలలో చేతిలో డబ్బులు లేని సమయంలో ఉపయోగించుకునే విధంగా బ్యాంకులు క్రెడిట్ కార్డులని కూడా అందిస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఈ క్రెడిట్ కార్డులని వినియోగిస్తున్నారు.
ఇక ఆన్ లైన్ షాపింగ్ కోసం ఈ క్రెడిట్ కార్డులని ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసిన మొదటి సారి మాత్రమే కార్డ్ నెంబర్ యాడ్ చేసి సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. అయితే ఆర్బీఐ కొత్త నిబంధనలని తీసుకొచ్చింది. సైబర్ నేరాలని అరికట్టడానికి గాను ఇకపై డిజిటల్ పేమెంట్ యాప్ లలో కార్డు నెంబర్ సేవ్ చేసే వెసులుబాటుని తొలగించింది.

కార్డు వివరాలని సేవ్ చేసుకునే వెసులుబాటు లేకుంటే షాపింగ్ చేసిన ప్రతిసారి కూడా కచ్చితంగా దానిపై ఉన్న నెంబర్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇలా ప్రతిసారి కార్డు నెంబర్ యాడ్ చేయాలంటే కాస్తా కష్టమైన పని అని చెప్పాలి. ఈ నేపధ్యంలో క్రెడిట్ కార్డు పేమెంట్ సిస్టంని సులభతరం చేయడానికి టోకెన్ అనే ఆప్షన్ ని తీసుకొచ్చారు. ఈ టోకెనైజేషన్ విధానంలో ఒకసారి కార్డు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఒక టోకెన్ క్రియేట్ చేయాలి. ఆన్ లైన్ ఈ-కామర్స్ యాప్ లలో షాపింగ్ చేసినపుడు టోకెన్ క్రియేట్ చేసి ఉంచుకుంటే అవి ఆ యాప్ లో సేవ్ కావు. కాని షాపింగ్ చేసిన ప్రతి సారి కూడా ఈ టోకెన్ ఉపయోగించి పేమెంట్ చేయొచ్చు అయితే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఈ కొత్త నిబంధనలు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.