Political: ఏపీలో మూడు రాజధానులు అంటూ వైసీపీ. ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే అంటూ మిగిలిన విపక్షాలు హడావిడి చేస్తూ రాజకీయం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న ఎన్నికలకి ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలని వారు సిద్ధం చేసుకొని ప్రజలలోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అయితే మళ్ళీ తమని సంక్షేమ పథకాలు అధికారంలోకి తీసుకువస్తామని భావిస్తున్నారు.
అలాగే మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాంతో ప్రాంతీయ ఎమోషన్ ని టచ్ చేస్తూ ఉన్న వ్యతిరేకతని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమరావతి రాజధానిగా ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే అజెండాతో మిగిలిన పార్టీలు తమ రాజకీయ వ్యూహాలని అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి.
మరో వైపు ఈ సారి తమ అధికార బలం ఉపయోగించుకొని అవసరం అయితే ప్రజలని భయపెట్టి, బెదిరించి విపక్షాల పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ వారిని ప్రజలకి దూరం చేయాలనే ఆలోచనతో వైసీపీ ఉన్నట్లు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది. అమరావతి రైతుల పాదయాత్రకి అడుగడుగున వైసీపీ నేతలు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన, జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు.
తమ నాయకులపై దాడి జరిగిందని చూపిస్తూ అస్సలు గొడవతో సంబంధం లేని వారిని అధికార బలంగా అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ నేతలు కూడా ఇష్టారీతిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎదురుదాడి చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి కాస్తా ఆవేశంగా మాట్లాడేసరికి ఇప్పుడు మహిళ కమిషన్ తో నోటీసులు ఇప్పించారు.
ఇదిలా ఉంటే ఎలా అయిన మూడు రాజధానుల అంశమే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి ప్రాంతీయ ఎమోషన్స్ ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ అధిష్టానం చేస్తుంది. ఇక దీనికోసం విశాఖని పరిపాలనా రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో రాజీనామాల రాజకీయం మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖని పరిపాలనా రాజధాని చేయాలని దానికోసమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే అది స్పీకర్ ఫార్మాట్ లో లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వారించడంతో అతను వెనక్కి తగ్గారనే విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికలకి ఆరు నెలల ముందు ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలతో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయించి పరిపాలనా రాజధాని కోసమే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలకి చెప్పాలని అనుకుంటున్నట్లు బోగట్టా.
ఇలా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని, రాజధాని కావాలనే ఫీలింగ్ ని వారిలో పెంచి ప్రాంతీయ ఎమోషన్స్ ని అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలని కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ కోసం రాజీనామా చేయించి అక్కడ అదే ప్రచారాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు.
ఆ విధంగా ఎన్నికలకి మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధి అనే అజెండాతో ప్రజలలోకి వెళ్లాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలా తమకున్న వ్యతిరేకత ఓటుని తగ్గించుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని కూడా తగ్గించొచ్చు అని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.