Pawan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజాక్షేత్రంలో ముందుకు వెళుతున్నారు. అయితే తెలుగుదేశం వైసీపీకి ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఇంకా ఎదగలేకపోయారు. బలమైన ప్రభావమైతే చూపించగలుగుతున్నారు కానీ 2024 ఎన్నికలలో దానిని ఎంతవరకు ఓటు బ్యాంకుగా మలుచుకోగలరు అనేది ఇప్పుడు చర్చనీయాంసంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా ఉభయగోదావరి జిల్లాలను ఎంపిక చేసుకుని జూన్ 14 నుంచి 10 నియోజకవర్గాలలో వారాహి యాత్ర చేయబోతున్నారు.
ఇక ఈ యాత్ర ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సాగనుంది. మొత్తం స్థానిక సమస్యలపై ఫోకస్ చేయడంతో పాటు అన్ని వర్గాల వారీతో మాట్లాడుతూ ఈ యాత్రని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టడం వెనుక బలమైన వ్యూహమే ఉందని తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ నియోజకవర్గాలలో అయితే యాత్ర చేయబోతున్నాడో ఆ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు లెక్క. ఈ యాత్ర ద్వారా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితమైన క్లారిటీ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
మొదటి దశలో భాగంగా పది నియోజకవర్గాలని పవన్ కళ్యాణ్ ఎంచుకొని యాత్ర చేయబోతున్నారు. ఇక వీటిలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ యాత్ర ప్రభావం ఎలా ఉండబోతోంది అనేదానిపై పవన్ కళ్యాణ్ కూడా తన వ్యూహం మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ఈ యాత్రలో చాలా మంది బలమైన నాయకులు జనసేనలోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్.