Parijatham Plant: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎన్నో రకాల వృక్షాలను కూడా దైవ సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఇలా దైవ సమానంగా భావించి పూజించే మొక్కలలో పారిజాతం ఒకటి. ఈ పారిజాత వృక్షాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తుంటారు.
పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి సాగర మధనం చేస్తున్నటువంటి సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ పారిజాతం వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆ ఇంటిలో సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక పారిజాత పుష్పాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా పూస్తాయి .
ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో విరబూసి ఉదయానికి చెట్టు నుంచి రాలిపోతాయి. ఇలా రాలిపోయిన పుష్పాలను ఏరి పూజించడం వల్ల శుభం కలుగుతుంది. ఇక పారిజాత వృక్షాన్ని మన ఇంటి ఆవరణంలో నాటుకునేటప్పుడు ఎక్కడపడితే అక్కడ కాకుండా తులసి కోట పక్కన నాటుకోవడం ఎంతో మంచిది. అలాగే ఇంటి దగ్గరలోనే ఆలయ ప్రాంగణం ఉంటే అక్కడ కూడా ఈ వృక్షాన్ని నాటడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.