Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలలో కాలుష్యం ఎక్కువైపోయింది. నీటి కాలుష్యం కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అనే సంగతి తెలిసిందే. మురుగునీరు, చెత్త వ్యర్ధాలు ఎక్కువగా పెరిగిపోయిన ప్రాంతాలలో ఈ దోమలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి పరిసరాలలో నివసించే వారు దోమల కాటుతో వ్యాధుల బారిన పడతారు.
ఇదిలా ఉంటే దోమలు మనుషుల్లో అందరి మీద దాడి చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశోధకులు దోమలు దాడి చేస్తున్న మనుషులపై పరిశోధనలు చేసి ఎక్కువగా అవి ఎవరిని ఎటాక్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. చర్మంపై కార్బాక్సిలిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉన్నవారిని దోమలు లక్ష్యంగా చేసుకుంటాయన నిర్ధారించారు. అలాంటి వారిపట్ల దోమలు వేగంగా ఆకర్షితం అవుతాయని, వారే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడతారని తెలియజేసారు.
ఇక రాత్రి సమయాలలో ముదురు రంగు వస్త్రాలు ధరించే వారిని కూడా దోమలు వేగంగా గుర్తించి ఎటాక్ చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి సమయంలో లైట్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే అంత వేగంగా దోమల బారిన పడమని కూడా చెబుతున్నారు. దోమలలో ఉండే అయస్కాంత శక్తి మనుషులని గుర్తించడంలో కీలకంగా పనిచేస్తాయని, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న మనుషుల నుంచి స్మెల్ గ్రహించి వారిని కుడతాయని అంటున్నారు. శుభ్రత, వస్త్రధారణ కూడా దోమల బారిన పడకుండా కాపాడుతాయని అంటున్నారు.