Wed. Jan 21st, 2026

    Janasena Vs YCP: ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసి దానిని ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు అధికార పార్టీ వైసీపీ జనసేనని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పట్టణాలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పల్లకి మోస్తున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాసుకొస్తున్నారు. అదే సమయంలో ఈ ఫ్లెక్సీలని సోషల్ మీడియాలో షేర్ చేసి విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా జనసైనికులని అవమానించడం, టీడీపీకి వ్యతిరేకంగా వారందరినీ మార్చడమే లక్ష్యం వైసీపీ పవన్ కళ్యాణ్ పై  ఈ రకంగా ఫ్లెక్సీలతో ప్రచారం మొదలు పెట్టింది.

    Ycp vs Janasena: వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్‌.. | Ycp vs Janasena  RVRAJU

    ఏదో ఒక రీతిలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేయడం ద్వారా, పదే పదే జనసైనికులని అవమానించడం ద్వారా టీడీపీకి దగ్గర కాకుండా ఒంటరిగా పోటీ చేసేలా చేయడమే లక్ష్యంగా జనసేనపై పోస్టర్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోస్తున్నట్లు, రథం మీద చంద్రబాబుని తీసుకొని వెళ్తున్నట్లు ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలు ప్రధాన పట్టణాలలో వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన మొదలు పెట్టారు.

    వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్ కి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, వైసీపే వర్గాల మధ్య ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. అయితే పోలీసులు కూడా కేవలం ఈ ఘటనలలో జనసేన నాయకులని మాత్రమే అరెస్ట్ చేస్తూ వైసీపీ వారిని వదిలేస్తున్నారు. దీనిపై కూడా జనసైనికులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక వ్యూహంలో భాగంగానే వైసీపీ జనసేనపై ముప్పేట దాడి చేస్తోందని, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రచారాలు చేస్తుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తోన్న మాట.