Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్ లతో వైసీపీపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకి మద్దతుగా వైసీపీ నాయకులు ఉత్తరాంధ్ర గర్జన పేరుతో సభ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి వ్యూహాత్మకంగా తీసుకొచ్చి అమరావతి రైతుల పాదయాత్రని ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకించే విధంగా చేయడానికి వైసీపీ శ్రేణులు అక్కడి నాయకులతో కసరత్తులు చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తున్నారని, అలాగే అమరావతి రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్ బ్యాచ్ విశాఖ రాజధాని కాకుండా అడ్డుపడే ప్రయత్నంలో ఉన్నారని అక్కడి ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా వరుసగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, మేధావుల ఫోరమ్ అంటూ కొత్తకొత్త మీటింగ్ లు పెడుతున్నారు. అలాగే మూడు రాజధానుల కోసం రాజీనామాలకి సిద్ధం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర గర్జన పేరుతో విశాఖలో భారీ ఎత్తున సభ నిర్వహించే ప్రయత్నం వైసీపీ సర్కార్ చేస్తుంది. అమరావతి రైతుల పాదయాత్ర కూడా అదే రోజు ఉత్తరాంధ్రలో అడుగుపెడుతుంది. అయితే వైసీపీ తెరపైకి తీసుకొచ్చిన విశాఖ రాజధాని, వికేంద్రీకరణ అంశంపై టీడీపీ శ్రేణులు బలంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఉత్తరాంధ్ర గర్జనపై తనదైన శైలిలో వరుస ట్వీట్ లతో విమర్శలు గుప్పించారు. అసలు దేనికి గర్జనలు అంటూ వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?. దేనికి గర్జనలు? విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా? అంటూ ఏకంగా 25 ప్రభుత్వ వైఫల్యాలని పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ ద్వారా ప్రభుత్వానికి సంధించారు.
అయితే ఈ ప్రశ్నలపై ఎప్పటిలాగే వైసీపీ మంత్రులు, నాయకులు పవన్ కళ్యాణ్ పై ప్యాకేజ్ అంటూ ఎదురుదాడి, వ్యక్తిగత దాడి చేయడం తప్పితే సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కదానికి వైసీపీ శ్రేణుల దగ్గర సమాధానం లేకపోవడమే వారు మరల పాత పాటనే అందుకొని ఎదురుదాడి చేస్తున్నారని జనసైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రభుత్వ వైఫల్యాలకి సంబంధించిన ట్వీట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయని చెప్పాలి. టీడీపీ శ్రేణుల విమర్శలకంటే పవన్ కళ్యాణ్ ట్వీట్స్ జనాలలోకి బాగా వెళ్లాయనే మాట వినిపిస్తుంది.