Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలా అయిన రాజకీయంగా తన ప్రభావాన్ని విస్తృతం చేసుకోవాలని, అవకాశం ఉంటే అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని నిలువరించేందుకు వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. వాటికి దీటుగానే జనసేనాని రాజకేయ కార్యాచరణ సిద్ధం చేసుకొని రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్నాడు. ఓ వైపు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నా కూడా రాజకీయంగా వీలైనంత వరకు యాక్టివ్ గా ఉంటూ ప్రజలకి తనపై నమ్మకం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం వైఫల్యాల మీద ఫోకస్ చేస్తున్నాడు. కౌలు రైతులకి లక్షరూపాయిల పరిహారం అనేది పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ ని బాగా పెంచింది. అదే సమయంలో జనవాణి కార్యక్రామానికి కూడా మంచి స్పందన వచ్చింది.
ఇక ఇప్పటం లో ఇళ్ళ కూల్చివేత ఘటన కూడా పవన్ కళ్యాణ్ కి కొంత మైలేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు యువశక్తి అనే కార్యక్రామానికి జనసేనాని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా యువతని లక్ష్యంగా చేసుకొని నిరుద్యోగం, స్కాలర్ షిప్పులు తొలగించడం వంటి అంశాలని ప్రధానంగా ఎంచుకోవడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడంలో వైసీపీ సర్కార్ విఫలం అయ్యిందనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం మొదలు పెడుతున్నారు. దీనికి పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకొని జనవరి నుంచి యువశక్తి పేరుతో వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే సమయంలో బస్సు యాత్ర కూడా మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత చైతన్య రథంతో తన బస్సు యాత్రని శ్రీకాకుళం నుంచి ప్రారంభించి విజయవంతం అయ్యారు.
పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో శ్రీకాకుళం బస్సు యాత్రని మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా జనవరి 12న రణస్థలం యువశక్తి సభని నిర్వహించబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లు, ప్రోగ్రామ్ ప్లాన్ అంతా నాదెండ్ల మనోహర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఈ యువశక్తి, వారాహితో బస్సు యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్లి ఏ స్థాయిలో మైలేజ్ పెంచుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.