Janasena: ఇప్పుడిప్పుడే బలంగా అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పార్టీలో కొంత మంది నాయకులతో అప్పుడే తలనొప్పి మొదలైంది అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎదిగే క్రమంలో అడ్డంకులు లేకుండా ముందుకి సాగాలి. అయితే కొంత మంది నాయకుల పోకడ మాత్రం పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టె విధంగా ఉన్నాయని జనసేన వర్గాలలో కూడా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా నెల్లూరులో జనసేన పార్టీలో వర్గ విభేదాలు తీవ్రం అయ్యాయి. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అంటే వినిపించే పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. అయితే నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. ఇద్దరు కూడా ఒకే నియోజకవర్గంలో ఉంటున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో చాలా కాలంగా వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. చాలా సందర్భాలలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి మనుక్రాంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏడాది కాలంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట అనే కార్యక్రమంతో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. దీనిని మంచి స్పందన వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా కేతంరెడ్డి చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. అయితే మనుక్రాంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని అంటిపెట్టుకొని, అతని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటిస్తే అతనితో పాటు ఉంటాడు.
ఈ నేపధ్యంలో మనుక్రాంత్ రెడ్డిని జనసేన ప్రోత్సహిస్తుంది అనే మాట బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి వర్గాల మధ్య నెల్లూరులో గొడవ జరిగింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఈ నేపధ్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మనుక్రాంత్ రెడ్డికి తనని సస్పెండ్ చేసే అధికారం లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ పంచాయితీఇప్పుడు జనసేన అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తుంది.
అయితే జనసేన పార్టీలో మెజారిటీ జనసైనికులు కేతంరెడ్డి వినోద్ రెడ్డికి అండగా ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేతంరెడ్డి వలన ఈ రోజు నెల్లూరులో జనసేన బలంగా ఉందని అతన్ని వదులుకుంటే పార్టీకి తాము కూడా దూరం అవుతామంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కాని నాగబాబు కాని రియాక్ట్ కావాలని కోరుతున్నారు. మరి ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.