INDIAN RAILWAYS: భారతీయ రైల్వే దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆధునికత, వేగం, సౌకర్యాలు అన్నింటిలోనూ ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్న భారతీయ రైల్వే, కొన్ని రైళ్ల విషయంలో మాత్రం ప్రయాణికులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. శుభ్రత లేకపోవడం, దుర్గంధం, టాయిలెట్ల దురావస్థ వంటి అంశాల వల్ల ప్రయాణం చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ఈ రైళ్ల పరిస్థితి మారాలంటూ సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అపరిశుభ్రమైన రైళ్లుగా పేరుగాంచిన కొన్ని ప్రధాన రైళ్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం:
అపరిశుభ్రమైన రైళ్ల వివరాలు :
సహర్సా – అమృత్‌సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
బీహార్ రాష్ట్రంలోని సహర్సా జంక్షన్ నుండి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు నడిచే ఈ గరీబ్ రథ్ రైలు దేశంలో అత్యంత మురికి రైలుగా గుర్తించబడింది. ప్రయాణికుల నిర్లక్ష్యం, మార్గమధ్య శుభ్రత లేమి, టాయిలెట్ల దయనీయ స్థితి వల్ల ఈ రైలు దుర్గంధానికి మూలమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసే పరిస్థితి మారకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది.
అజ్మీర్ – జమ్ము తావి పూజ ఎక్స్‌ప్రెస్
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుండి జమ్ముకాశ్మీర్‌లోని జమ్ము తావి వరకు నడిచే ఈ రైలు రెండు మూడు రాష్ట్రాలను కవర్ చేస్తుంది. అయితే శుభ్రత విషయంలో మాత్రం ఈ రైలు పూర్తిగా విఫలమైంది. టాయిలెట్ల దుర్గంధం, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం కారణంగా ఇది కూడా అపరిశుభ్రమైన రైళ్లలో ఒకటిగా నిలిచింది.
స్వరాజ్ ఎక్స్‌ప్రెస్
ముంబై నుండి వైష్ణో దేవి ఆలయం వరకు నడిచే ఈ రైలు యాత్రికులకు ముఖ్యమైనదైనా, దీని శుభ్రత మాత్రం ప్రమాదకర స్థాయిలో ఉంది. పలుమార్లు ప్రయాణికులు ఫిర్యాదు చేసినా, శుభ్రతలో మార్పు కనిపించడం లేదు. చెత్తాచెదారం మధ్య ప్రయాణం చేయాల్సిన పరిస్థితి తప్పని యాత్రగా మారుతోంది.

INDIAN RAILWAYS:
త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి త్రిపురలోని అగర్తలా వరకు నడిచే ఈ రైలు ఎంతో దూరం ప్రయాణిస్తుంది. కానీ శుభ్రత విషయంలో దీనికి వచ్చిన విమర్శలు విపరీతం. ఈ రైలు టాయిలెట్ల దయనీయ పరిస్థితి, చెత్త పేరుకుపోవడం వల్ల “మురికి రైలు”గా పిలవబడుతోంది. ప్రయాణికుల ఫిర్యాదులకు స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి బీహార్‌లోని జోగ్ బాని వరకు నడిచే ఈ రైలు కూడా శుభ్రతలో తీవ్రంగా వెనుకబడి ఉంది. చెత్తతో నిండి ఉండే ఈ రైల్లో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. వాసన, అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రయాణికులు దూరంగా ఉండేలా చేస్తున్నది.
తక్షణ చర్యల ఆవశ్యకత
ఈ రైళ్ల పరిస్థితి రైల్వే శాఖ సర్వీసులపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని, క్లీనింగ్ సిబ్బందిని బలోపేతం చేయాలని, ప్రయాణికుల బాధ్యతను కూడా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. రైలు ప్రయాణం నెమ్మదిగా సౌకర్యవంతమైన దశకు చేరుకుంటుండగా.. ఇలాంటి అపరిశుభ్రతలు ఆ ముందడుగును వెనక్కి లాగుతున్నాయి.

