Technology: టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటోంది. అందుకు తగ్గట్లుగానే నిజ జీవితంలో టెక్నాలజీ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రతి రోజు ఏదో ఒక స్టార్టప్ కంపెనీ ఉద్భవిస్తూనే ఉంటోంది. వ్యాపార సంబంధాలు పని భారం తగ్గి సులభతరం చేయడానికి అనేక సాధనాలు సృష్టించబడుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే స్టార్టప్ కంపెనీ కూడా ఈ జాబితాలోకే వస్తుంది. వ్యాపారులు తమ కస్టమర్‌లకు ఉచిత పుష్ నోటిఫికేషన్‌లను పంపడానికి అదేవిధంగా ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి వీలు కల్పించే కస్టమర్ ఎంగేజ్‌మెంట్ టూల్‌ను రూపొందించిన స్టార్టప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2019 లో రవి వకా, మనోజ్ సూర్యలు ట్రూపుష్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీ 30 మంది సభ్యుల బృందంతో పని చేస్తోంది. రవి, మనోజ్ ఇద్దరూ స్టార్టప్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ అనే గ్లోబల్ స్టార్టప్ ప్రోగ్రామ్‌లో క్రియాశీల సభ్యులు. మనోజ్ సూర్య ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, IIIT-CIEకి ఇంక్యుబేషన్ మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక రవి కూడా ఇంజనీరింగ్ నేపథ్యం నుండే వచ్చాడు. ఇతను IIT కాన్పూర్ నుండి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేసాడు.
రవి వాక , మనోజ్ సూర్య లు ఓ ఎంటర్‌ప్రీనర్ లీడర్ షిప్ ప్రోగ్రామ్‌లో కలుసుకున్నారు. అప్పుడే ఈ స్టార్టప్ కంపెనీ ఆలోచన ప్రారంభమైంది. స్టార్టప్ వ్యవస్థాపకులు అయిన ఇద్దరూ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి ఒక సాధనాన్ని రూపొందించాలనుకున్నారు. వీరిద్దరూ తమ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. వ్యాపారులు తమ కస్టమర్‌లకు ఉచిత పుష్ నోటిఫికేషన్‌లను పంపడానికి వీలు కల్పించేలా వీరు ట్రూపుష్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ట్రూపుష్ వెబ్, మొబైల్ రెండింటికీ ఉచిత పుష్ నోటిఫికేషన్లు పంపించే సాధనంగా మారింది. ఇది కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.
ట్రూపుష్ న ప్లాట్‌ఫారమ్‌లో ఆడియన్స్ సెగ్మెంటేషన్, ఆర్ఎస్‌ఎస్-ట్రూ-పుష్, ట్రిగ్గర్స్, ప్రాజెక్ట్ డూప్లికేషన్, బ్యాచింగ్ మొదలైన అనేక ఫీచర్లను ఉచితంగా అందిస్తుంది. అయితే ఇవి సాధారణంగా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బుల చెల్లించాల్సి వస్తుంది. ట్రూ పుష్ అనేది ప్రపంచంలోనే ఉచిత పుష్ నోటిఫికేషన్‌లను పంపించే కంపెనీ. అందుకే దీనికి G2 లో 4.7/5 అత్యధిక రేట్ ను అందించారు. ట్రూపుష్ దాని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ తో, చాలా మంది విక్రయదారుల మొదటి ఎంపికగా మారింది. అనేక రిచ్ ఫీచర్‌ల కారణంగా, స్టార్టప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20,000లకు పైగా డెవలపర్‌లు, విక్రయదారులకు సేవలు అందిస్తోంది.
ఈ కంపెనీ ప్రారంభమైన 18 నెలల్లోనే, ట్రూపుష్ తన పోటీదారులకు సర్వీస్ , కస్టమర్ సపోర్ట్ పరంగా ముందుంది. ట్రూపుష్ పూర్తి కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్ యాప్‌లో మెసేజింగ్, ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్ మొదలైన ఇతర కస్టమర్ ఎంగేజ్మెంట్ సాధనాల్లోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్రూపుష్ మరింత తెలివైన డెలివరీ సాధనాలను రూపొందించాలని ప్రపంచంలోని ప్రముఖ పుష్ నోటిఫికేషన్‌ల కంపెనీగా అవతరించాలని కోరుకుంటోంది. మరి ఈ యువకుల కోరిక నెరవేరాలని మనమూ ఆశిద్దాం.