Fish Venkat: టాలీవుడ్‌లో తనదైన హాస్య శైలితో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్ (వయసు 53) ఇకలేరు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ చికిత్స పొందుతున్నారు.
వైద్యుల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరమని ఆయన కుమార్తె ఇటీవల మీడియా ద్వారా వెల్లడించారు. కుటుంబ ఆర్థిక పరిమితుల కారణంగా, సాయం కోరుతూ ఆమె అప్పీల్ చేసిన సమయంలోనే వెంకట్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. అయితే, ఎంతో ఆశగా ఎదురుచూసిన సమయంలో ఆయన మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నటనా ప్రస్థానం..
ఫిష్ వెంకట్ తన నటనా జీవితంలో 100కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుప్రీమ్, డీజే టిల్లు వంటి పాపులర్ చిత్రాల్లో వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ యాస, టైమింగ్ కామెడీతో హాస్యాన్ని పంచారు. ఆయన నటించిన చివరి సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్.

Fish Venkat: ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్.
‘ఫిష్ వెంకట్’గా ఎలా మారారు?..
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్. మచిలీపట్నం ఆయన స్వస్థలం. మొదట్లో చేపల వ్యాపారం చేసేవారు. అందుకే ఆయనను ‘ఫిష్ వెంకటేశ్’గా పిలిచేవారు. తర్వాత అదే పేరు ఫిష్ వెంకట్‌గా స్థిరపడిపోయింది. 1989లో ఓ స్నేహితుడి ద్వారా నిర్మాత మాగంటి గోపినాథ్ పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణానికి ఆరంభమైంది. 1991లో ఆయన నిర్మించిన ‘జంతర్ మంతర్’ సినిమాలో తొలిసారి నటించారు.
కానీ 2002లో ఎన్టీఆర్ హీరోగా నటించిన వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది చిత్రంతోనే ఫిష్ వెంకట్‌కు నిజమైన గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని, వీవీ వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే శ్రీహరి కూడా తనను ఎంతో ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివసిస్తోంది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో టాలీవుడ్‌లోని ఆయన సన్నిహితులు, అభిమానులు, సహనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని మరణం తెలుగు చిత్రసీమకు తీరని నష్టం.

