Chandra Mohan: చంద్రమోహన్ జీవితంలో అదొక్కటే పెద్ద అసంతృప్తి..ఏంటో తెలుసా..? ప్రముఖ తెలుగు సినీ నటుడు చంద్రమోహన్ (81) ఈరోజు (11.11.23) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విషాద చాయలు చుట్టుకున్నాయి. ఇక చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖులంతా ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. కాగా, సోమవారం(13.11.23) హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
చంద్రమోహన్ చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా సినిమాలు చేసే అవకాశం అందుకున్నారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి అగ్ర తారలతో ఆయన హీరోగా నటించారు. హీరోగా మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాలో నటించి మెప్పించారు. ఇక ఇప్పటి తరం హీరోలకు తండ్రిగా, తాతగా కూడా నటించి ఆకట్టుకున్నారు.
Chandra Mohan: ప్రేక్షలోకానికి తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి.
అయితే, చంద్రమోహన్ గురించి ప్రేక్షలోకానికి తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన కృష్ణజిల్లా పమిడిముక్కలలో 1943లో పుట్టారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ అయితే, సినిమాల్లోకి వచ్చాక చంద్రమోహన్ గా పేరు మార్చుకున్నారు. ఇక ఆయన విద్యాభ్యాసం బాపట్లలో సాగింది. అక్కడ ఉన్న వ్యవసాయ కాలేజీలో ఢిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చంద్రమోహన్ నటించిన మొదటి సినిమా ‘రంగుల రాట్నం’. ఇది 1966లో విడుదలైంది. ఈ క్రమంలోనే తమిళ సినిమాలలోనూ అవకాశాలు దక్కించుకున్నారు
చంద్రమోహన్ నటనకు గానూ ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు దక్కాయి. అయితే, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఉన్న అసంతృప్తి ఒకటేనని తెలిపారు. ప్రజాభిమానాలే తనకు అవార్డులు రివార్డులు అని.. తన సీనియర్లు సావిత్రి, కన్నాంబ, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి గొప్ప నటీనటులు ఉంటే వారికి ఇలాంటి అవార్డులు దక్కలేదని తెలిపారు. వీరికి గనుక అవార్డులు ఇచ్చి ఉంటే, ఆ అవార్డులకే గౌరవం వచ్చేదని చెప్పుకొచ్చారు. మన ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారికే పద్మశ్రీ పురస్కారాలు దక్కలేదు. కాబట్టి ఆ పురస్కారాలపై నాకు ఆసక్తి లేదని తెలిపారు చంద్రమోహన్.