Smart phone: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత వీటి వాడకం బాగా పెరిగింది. దీంతో ఫోన్స్ లో గంటల తరబడి ఛార్జింగ్ ఉండే పరిస్థితి ఉండదు. దీంతో ఫోన్ ఛార్జింగ్ కోసం బ్యాక్ అప్ పవర్ బ్యాంకులు వినియోగిస్తున్నారు. అలాగే పవర్ బ్యాంకు లేని సమయంలో అత్యవసర వినియోగం కోసం రోడ్ సైడ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని అక్కడికి వెళ్లి పెట్టుకుంటున్నారు. ఇలాంటి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ని ప్రధాన నగరాలలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాలలో వీటి ఉనికి తక్కువగానే ఉన్న నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మధ్య కాలంలో మొబైల్ పబ్లిక్ పవర్ పాయింట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే అలాంటి పబ్లిక్ పవర్ స్టేషన్ లందు ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైన తర్వాత సైబర్ మోసాలు మరింత ఈజీ అయిపోయాయి.
కొత్త కొత్త మార్గాలలో ఈ టెక్ కేటుగాళ్లు మన ఫోన్ డేటాని దొంగిలించి బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మాయం చేయడం, అలాగే మన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకొని బెదిరింపులకి పాల్పడటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ పవర్ స్టేషన్స్ ని కూడా సైబర్ దొంగలు తమకి అనుకూలంగా మార్చుకున్నట్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఫోన్స్ కి యూఎస్బీ కేబుల్ సహాయంతో ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ సమయంలో వారు తెలియకుండానే మన ఫోన్స్ లోకి ఒక హ్యాకింగ్ వైరస్ ని ఇంజక్ట్ చేస్తారు. తరువాత మన ఫోన్ డేటా మొత్తం వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ వైరస్ ఉందనే విషయం గుర్తించకుండా ఫోన్ ద్వారా లావాదేవీలు చేసినపుడు సమాచారం దొంగిలించి అకౌంట్స్ లో డబ్బులు ఖాళీ చేస్తారు.
ఇలా ఫోన్స్ హ్యాక్ చేసి సమాచారం దొంగిలించడాన్ని జ్యూస్ జాకింగ్ అని సాంకేతిక భాషలో అంటున్నారు. ముఖ్యంగా పబ్లిక్ స్టేషన్లలో ఫోన్ చార్జింగ్ చేసే సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు లేకుండా ఉంటే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూఎస్బీ కేబుల్స్ ని హ్యాకర్లు వారికి అనుకూలమైన వేరే డివైజ్ కి సెటప్ చేస్తారు. వాటి పిన్ ని చార్జింగ్ కోసం అని ఫోన్ కి అటాచ్ చేయగానే మన ఫోన్ హ్యాక్ అవుతుంది. ఆ సమయంలో ఒక మలవేర్ ని ఫోన్ లోకి వారు పంపించే ప్రయత్నం చేస్తారు.
ఫోన్ లో చార్జింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రాంప్ట్ వస్తుంది. హ్యాకర్లు అయితే దానిని ఓకే చేయమని చెబుతారు. ప్రాంప్ట్ ఓకే చేస్తే చార్జింగ్ అవుతుందని కూడా అంటారు. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాంప్ట్ కి క్లిక్ చేయకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే మన ఫోన్ కి సంబంధించిన సమస్త సమాచారం వారి చేతికి అందించినట్లు అవుతుంది. అయితే దూర ప్రాంతాలకి వెళ్ళినపుడు మొబైల్ చార్జర్స్ ని మనతో పాటు తీసుకొని వెళ్లి కేవలం ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు ఉన్న ప్రాంతాలలో చార్జింగ్ పెట్టుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. పబ్లిక్ మొబైల్ చార్జింగ్ స్టేషన్స్ కి వెళ్లకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు.