Anand Devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్‌రాజు నిర్మాణంలో , గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 5న ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయింది. తాజాగా ఈ మూవీపై విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కి ముందే కొందరు కావాలని నెగెటివ్‌గా ప్రచారం చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ స్టార్‌లోని కొన్ని సీన్స్, ఫోటోలు, స్క్రీన్ షాట్లను తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని దాని ప్రభావం సినిమాపై పడి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టం మిగిలిందని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోసారి ఫ్యామిలీ స్టార్ గురించి డిస్కషన్ జరుగుతోంది.
బేబీ వంటి హిట్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గం గం గణేశా అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్యామిలీ స్టార్ నెగెటివిటీ గురించి హీరో ఆనంద్ దేవరకొండను జర్నలిస్టులు ప్రశ్నించారు. దానికి ఆనంద్ స్పందించాడు. “కొన్ని ప్రాంతాల్లో కావాలనే విజయ్ ని టార్గెట్ చేసి ఫ్యామిలీ స్టార్ పై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎవరైనా ఒకరు వాళ్ల సొంత అభిప్రాయాన్ని బయటకు చెప్పవచ్చు అందులో తప్పు లేదు. కానీ ఒక గ్రూపు గా ఫామ్ అయ్యి చాలామంది దానిని ట్రెండ్ చేసి ఆ సినిమాని చంపేసే ప్రయత్నం చేశారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు.
ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి 48 గంటలు ముందు నుంచే విజయ్ దేవరకొండ పాత మూవీస్ నెగిటివ్ టాక్ తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్ అని థంబ్ నెయిల్స్ అని పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారు. ఇదంతా ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తున్న పని. అయితే అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది మేం చెప్పలేం. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సినిమా చూసి నచ్చక పోతే నెగిటివ్ గా మాట్లాడవద్దు అని నేను అనడం లేదు. నిజానికి ఆ విషయంలో మనకి హక్కులు ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తిని, ఒక సినిమాని టార్గెట్ చేసి ఎటాక్ చేయడం ఎందుకు? ఇదంతా వదిలేస్తే మా అన్న ఇకపై చేసే సినిమాలన్నీ చాలా మంచివే. మొన్ననే వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ మూడు మంచి టాక్ ను సొంతం చేసుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇలా విజయ్ ని టార్గెట్ చేస్తున్నది సినిమా వాళ్లా ? బయటివారా? అని అడిగితే… అదే తెలిస్తే పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇస్తాము” అని ఆనంద్ తెలిపాడు.