RK Roja: వైసీపీలో పర్యాటక శాఖ మంత్రిగా రోజా కీలక బాద్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ కి ఫైర్ బ్రాండ్ అనే ముద్రని కూడా ఈమె సొంతం చేసుకున్నారు. ప్రత్యర్ధులు ఎవరైనా కూడా తన మాటల వాగ్ధాటితో విరుచుకుపడుతుంది. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అస్సలు సంకోచం లేకుండా విమర్శలు చేసే రోజా ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీని, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంది. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సైతం ఆమె ఆవేశానికి అడ్డుకట్ట వేయలేడు. ఇక మీడియా, మైక్ ముందు కనిపిస్తే వెంటనే రోజాకి తన శాఖ ద్వారా చేస్తున్న పనుల గురించి కాకుండా ప్రతిపక్షాలని విమర్శించాలనే ఆలోచనే వస్తుంది అనేది విపక్షాల ఆరోపణ.
దైవదర్శనంకి వెళ్లి తిరుమల కొండపై కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేసే రాజకీయ నాయకురాలిగా రోజాపై మరో ముద్ర కూడా ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళిన మీడియా ముందుకి వచ్చేసరికి ప్రతిపక్షాల మీద ఘాటుగా విమర్శలు చేయడం రోజా నైజం అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మొత్తానికి ఈ విమర్శలతోనే ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొంది ఏకంగా మంత్రి పదవిని సైతం రోజా సొంతం చేసుకుంది అని విపక్షాలు చేసే విమర్శలు. అయితే వచ్చే ఎన్నికలలో నగరిలో ఈమెకి సొంత పార్టీ నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా అక్కడ కొంతమంది నాయకులు రోజాకి వ్యతిరేక వర్గంగా ఉన్నారు.
వీరందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నది వైసీపీలో జగన్ తర్వాత సెకండ్ లీడర్ గా చెప్పుకునే వ్యక్తి కావడం విశేషం. చాలా కాలంగా రోజాకి ఆ నాయకుడికి మధ్య అస్సలు పడటం లేదు. దీంతో అతను సెకండ్ క్యాడర్ లీడర్స్ ని నగరిలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. రోజాకి చెప్పకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. అయితే ఈ ఘటనలపై రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నా కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉందని తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో నగరి నుంచి రోజాని ఓడించడానికి సదరు నాయకుడు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి అదే జరిగితే అప్పుడు వైసీపీలో కుట్రలపై రోజా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.