Science: ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల ఉనికిపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని దేశాలు విశ్వంపై ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇండియా ఓ వైపు గ్రహాల ఉనికిపై, అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేస్తుంది. దీనికోసం రాకెట్స్ ని ప్రయోగిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాలని గుర్తిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిపై కాకుండా ఇతర గ్రహాలలో జీవం ఉనికి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే నీరు ఉన్న చోట జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నీటి ఉనికి ఎక్కడ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలని గుర్తించింది. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్నట్లు కూడా టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. అయితే ఇవి మన నక్షత్ర మండలంలో కాకుండా 218 కాంతి సంవత్సరాల దూరంలో లీరా నక్షత్ర మండలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న నక్షత్రం మరుగుజ్జు నక్షత్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్న నేపధ్యంలో జీవానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా నాసా పరిశోధకులు చెబుతున్నారు.
అయితే 200 పైగా కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహాలు ఉండటంతో మానవుడు అక్కడికి చేరుకునే టెక్నాలజీ కనిపెట్టడానికి చాలా ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. అయితే ఆ గ్రహాలపై మానవుని పోలిన జీవజాలం ఏమైనా ఉందా అనే విషయాలపై నాసా ఇప్పుడు పరిశోధనలు చేయనుంది. ఇదిలా ఉంటే ఈ గ్రహాలకి కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. ఈ రెండు గ్రహాల్లో అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీటిపై మరింత పరిశోధనలని శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు.