Politics: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయ కార్యాచరణతో చురుకుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీపై ఎదురుదాడి చేస్తూ, వారి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. వైసీపీ నేతలు కూడా టీడీపీ కంటే ఎక్కువగా జనసేనాని పైనే ఎదురుదాడి చేస్తున్నారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వైఫ్యలాలని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళడంలో మాత్రం జనసేనాని సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. అలాగే ప్రజల మద్దతు కూడా పెంచుకుంటున్నారు. వరుసగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి చేరువ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని వీకెండ్ పొలిటీషియన్ అంటూ వైసీపీ నేతలు కొత్త విమర్శలు తెరపైకి తీసుకొచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే దీనిపై జనసేనాని రెగ్యులర్ గా స్పందించడం లేదు. కాని ప్రజలలోకి వచ్చినపుడు మాత్రం వైసీపీ నేతలు అందరికి గట్టిగానే ఇస్తున్నారు. వారిపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సత్తెనపల్లిలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర చేసింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబ సభ్యులకి లక్ష రూపాయిల చెక్కులు పంపిణీ చేశారు. ఇక ఈ సభలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైసీపీపై మరోసారి విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పిన మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అలాగే వైసీపీ లాంటి అరాచక శక్తులని ఓడించాలంటే కచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోనని, ప్రజలు కోరుకుంటే మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని అన్నారు.
అలాగే వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీ అధికారంలోకి రాదనీ, ఓడిపోతుందని అన్నారు. అలాగే జనసేన నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేయాలని, అయితే గెలుపు వ్యూహాల సంగతి నాకు వదిలేయాలని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఓడిపోతామనే భయంతో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని, భయపెట్టి, బెదిరించి అన్ని రకాలుగా ఆపాలని చూస్తుందని, అయితే అధికారంలో రావాలంటే మాత్రం బలంగా పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. అలాగే వారాహి వాహనంతో ఏపీలో రహదారుల మీద తిరుగుతానని, యాత్ర చేస్తానని, తన మీద అరిచే వైసీపీ గాడిదలు ఏ విధంగా అడ్డుకుంటారో చూస్తానని, మీరు అడ్డుకుంటే నేనేంటో చూపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. గత కొంత కాలంగా తనపై వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసారో అన్నింటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ సభా వేదికగా క్లారిటీ ఇచ్చారు.