Ugadi: తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఉగాది పండుగ తెలుగు వారికి అసలైన నూతన సంవత్సర ప్రారంభమని చెప్పాలి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఉగాది పండుగ రోజును ఏప్రిల్ 9వ తేదీ జరుపుకోబోతున్నారు మరి ఈ పండుగ రోజు ఏ విధమైనటువంటి దేవుళ్లను పూజించాలి ఉగాది పండుగ రోజు చేసే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అనే విషయానికి వస్తే…
ఈరోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. ఇలా స్నానం చేసిన అనంతరం శుభ్రమైన దుస్తులను ధరించి వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి దేవదేవులను పూజిస్తాము దేవుడిని ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేసుకున్న అనంతరం స్వామి వారికి నైవేద్యాలను సమర్పించి పూజ ప్రారంభిస్తారు.
శ్రీ మహా విష్ణువు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు. అలాగే ఇష్టదేవతల స్తోత్రములు పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా పరిగణిస్తారు. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంటుంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీవితం కష్టసుఖాల మయం అని చెప్పడమే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత అని పండితులు చెబుతున్నారు.