Health care: ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొన్ని కఠినమైన ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేకపోతే వ్యాధి నియంత్రణ కోల్పోయి శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణింప చేస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు సిగరెట్, బీడీ, పొగాకు తాగే అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టం తప్పదు అంటున్నారు నిపుణులు.
కొన్ని అధ్యయనాల ప్రకారం పొగ తాగే వారిలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇప్పటికే షుగర్ వ్యాధితో బాధపడేవారు పొగ తాగితే వ్యాధి నియంత్రణ మరింత కష్ట సాధ్యమవుతుంది. పొగాకులో ఉండే కొన్ని రసాయనాలు ఇన్సులిన్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది.తద్వారా డయాబెటిస్ వ్యాధి నియంత్రణ కోల్పోవడమే కాకుండా మూత్రపిండాలు, గుండె,ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పొగ తాగని వారితో పోల్చితే పొగ తాగే వారిలో దాదాపు 35 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలల్లో వెల్లడింది.
పొగ తాగితే దీని ప్రభావం నేరుగా ఊపిరితిత్తులపై ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా పొగ తాగే వారిలో బ్రాంకైటిస్,ఎంఫిసెమా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీకు షుగర్ వ్యాధి ఉంటే ఈ ఇన్ఫెక్షన్లు మీకు ప్రమాదకరంగా మారతాయి. ఒక అధ్యయనం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్నవారే ఎక్కువగా న్యుమోనియాతో చనిపోయే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.