YSRCP: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి క్రాస్ ఓటింగ్ వేశారు అని ఆరోపణలతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు మొదటి నుంచి జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీకి విధేయులుగా ఉన్నవారు కావడం విశేషం. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వెంట ఉంటూ ఎమ్మెల్యే పదవులకి కూడా రాజీనామా చేసి వచ్చారు. జగన్ వెంట నడిచారు. ఇక ఉండవల్లి శ్రీదేవి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే వైసిపితో కావడం విశేషం.
ఇదిలా ఉంటే తాజాగా వైసిపి అధిష్టానం సస్పెండ్ చేసిన నలుగురిలో ఈ ముగ్గురు కూడా ఉండడం విశేషం. పార్టీకి విప్ ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలతో వైసిపికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి అనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి వైసిపి సంక్షేమ పథకాలుగా చెప్పుకుంటున్న జగన్ అన్న గృహాలు పెద్ద స్కామ్ అని విమర్శలు చేసింది. అలాగే అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించింది. రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానని ఛాలెంజ్ చేసింది.
ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చాలెంజ్ చేస్తూ చెప్పారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో బలమైన పట్టు కూడా ఉంది. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా బలమైన ఓటు బ్యాంకు ఉంది. వీరిని సస్పెండ్ చేయడం వల్ల రానున్న ఎన్నికలలో కచ్చితంగా వైసీపీకి నెల్లూరు, గుంటూరు జిల్లాలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. కచ్చితంగా ఈ నలుగురు ఎమ్మెల్యేల ప్రభావం రానున్న ఎన్నికలలో వైసిపి గెలుపు ఓటమి నిర్ణయిస్తుందని అంచనా వేస్తున్నారు.