YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 నియోజకవర్గానికి లక్ష్యంగా జగన్ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు వై నాట్ 175 అంటూ కొత్త నినాదంతో కార్యకర్తలను, నాయకులు ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరలా తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ముఖ్యమంత్రి జగన్ చాలా నమ్మకంగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్రింది స్థాయి నాయకులతో సంబంధం లేకుండా మహిళలకు ఖాతాలో సంక్షేమ పథకాల పేరుతో నిధులను వేస్తున్నారు. దీనికోసం ఎక్కడా లేని అప్పులు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది.
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరు ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ఎమ్మెల్యేలు అందరూ కూడా సంక్షేమ పథకాలపై బలంగా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారు చేయడం జరుగుతుందని కూడా క్లారిటీగా చెప్పాడు. రిపోర్ట్ లు తెప్పించుకొని చూస్తానని అందులో ఉన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఖరారు చేస్తానని కూడా కరాకండిగా తేల్చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ మూడవ తేదీన చివరిగా మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు కూడా సరిగా లేకపోతే పదవులు నుంచి తొలగిస్తానని జగన్ క్లారిటీగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరికి సీట్లు ఇచ్చేది ఎవరికి ఇవ్వనిది ఈ సమీక్ష సమావేశంలో తేల్చేయమన్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అదే సమయంలో ఎన్నికలకు ఎప్పుడు వెళ్లేది కూడా స్పష్టంగా చెప్పే అవకాశం ఉందని ప్రచారం నడుస్తూ ఉంది.
ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఏప్రిల్ 3 అధికార పార్టీ నాయకులను కలవరపెడుతుంది. ఇప్పటికే పార్టీ ధిక్కరించారని ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలను జగన్ సస్పెండ్ చేశారు. దీని ద్వారా మిగిలిన అందరికి కూడా క్లియర్ సాంకేతాలు ఇచ్చారు. అసంతృప్తులు ఎవరైనా ఇప్పుడే బయటికి వెళ్లి పోవాలని, తనతో బయటకు గెంటించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని కూడా చెప్పినట్లు అధికార పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. మరి జగన్ ఏప్రిల్ 3న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.