YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ 2గా సజ్జల రామకృష్ణా రెడ్డి ఉన్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంచి ప్రాధాన్యత లభించేది. అయితే ఇప్పుడు సజ్జల ఆధిపత్యం పెరిగాక పెద్దిరెడ్డి పెత్తనం కూడా పార్టీలో తగ్గిందనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పాలనుకునే ఏ విషయాన్ని అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకి ఏదైనా ముఖ్యమంత్రితో మాట్లాడాలని నియోజకవర్గ సమస్యలపై చర్చించాలని అనుకుంటున్న అవి కూడా సజ్జల రామకృష్ణా రెడ్డితోనే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
ఏదో దైవ దర్శనం ఇచ్చినట్లు సమీక్షల సమయంలో తప్ప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకి కలిసే అవకాశం ఇవ్వడం లేదనే టాక్ ఇప్పుడు వైసీపీ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. సజ్జల ఆధిపత్యం పెరిగాక నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యేలకి జగన్ ని మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే ప్రచారం నడుస్తుంది. కొన్ని నియోజకవర్గాలలో సజ్జల కలుగజేసుకొని తనకి అనుకూలంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గుస్సా నడుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుని కూడా సజ్జల డిసైడ్ చేస్తున్నాడని, అతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఇక సజ్జల తర్వాత సోషల్ మీడియా టీమ్ ని హ్యాండిల్ చేస్తున్న సజ్జల కుమారుడు అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యిందనే చర్చ మొదలైంది. ఏ ఎమ్మెల్యేలకి అయితే టికెట్ లు రావని అనుకుంటున్నారో వారిని సైలెంట్ చేసేందుకు ఎక్కువగా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ లో నెగిటివ్ ప్రచారాలు చేయిస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఈ విషయాన్నీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కూడా బయటకి వచ్చాక ప్రస్తావించారు.
అలాగే కోటంరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు రాఘవరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు తప్ప జగన్ రెడ్డి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక వైసీపీలో ఎమ్మెల్యేలు కూడా సజ్జలని ప్రసన్నం చేసుకుంటే తమ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనే ఆలోచనలతో అతనిపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఎదురుదాడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి షాడో సీఎంగా వైసీపీలో ఉన్నారనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.