YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. దానికోసం కొత్తగా పార్టీ కోసం పనిచేసేందుకు గృహ సారథులని ఏర్పాటు చేస్తుంది. ఈ బాధ్యతని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకి ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి గృహసారథులు సిద్ధం కావాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రతి 50 ఇళ్ళకి ముగ్గురు సారథులు ఉండే విధంగా నియామకం చేపట్టాలని తెలిపారు. వారందరూ కూడా పార్టీ కోసం పని చేస్తూ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఈ నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో గృహ సారథులని నియమించే దిశగా అందరూ అడుగులు వేస్తున్నారు.
అయితే వాలంటీర్లని గతంలో నియమించి వారికి ప్రభుత్వం నుంచి 5 వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న గృహసారథులు ఎవరూ కూడా రూపాయి కూడా ఆశించకుండా పార్టీ కోసం కూలీల మాదిరిగా పనిచేయాలి. అయితే ఎన్నికల సమయంలో వీరి చేతుల మీదుగానే వైసీపీ డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తుంది. అయినా కూడా ఉద్యోగాలు వదులుకొని, ఖాళీగా రూపాయి లాభం లేకుండా వైసీపీని గెలిపిస్తే తమకి వచ్చే లాభం ఏంటి అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట.
ఈ నేపధ్యంలో గృహ సారథులుగా పనిచేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని తెలుస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని గృహ సారథులుగా నాయకుల జెండాలు మోయడానికి పంపించడానికి సిద్ధంగా లేరు. తమ పిల్లలు గ్రామంలో ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే గ్రామ సారథుల పేరుతో వైసీపీ అధిష్టానం కుర్రాళ్ళని పార్టీ సేవకులుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గృహ సారథుల నియామకం నాయకులకి తలకుమించిన భారం అవుతుందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.