Movies: తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ లెవల్ కి తీసుకెళ్ళిన సినిమాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితం కావడంతో హాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. అలాగే హాలీవుడ్ లో ప్రముఖ, దర్శకుల మన్ననలు కూడా ఈ మూవీ సొంతం చేసుకుంటుంది. మార్వేల్ సిరీస్ దర్శకుడు కూడా ఆర్ఆర్ఆర్ తన ఫేవరేట్ ఇండియన్ మూవీ అని చెప్పారంటే దాని స్థాయి ఏంటో చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఆర్ఆర్ఆర్ కి ఉన్నాయని అంతర్జాతీయ ఫిల్మ్ క్రిటిక్స్, మ్యాగజైన్స్ కూడా చెబుతున్నాయి.
అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాని ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ జాబితాలో పరిగణించకుండా ఒక గుజరాతీ మూవీని పంపించింది. అది కూడా ఇంకా రిలీజ్ కాని ఒక ఆర్ట్ మూవీ. అయితే భారీ బడ్జెట్ తో భారీ హంగులతో ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించిన ఆర్ఆర్ఆర్ సినిమాని ఒక కమర్షియల్ చిత్రంగానే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు పరిగణించడం గమనార్హం. అయితే రాజమౌళి మాత్రం ఇండిపెండెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. ఈ నేపధ్యంలో ఆస్కార్ ఎంపిక ప్యానల్ సభ్యుల దృష్టిలో ఆర్ఆర్ఆర్ మూవీ పడాలంటే అంతర్జాతీయ చిత్రోత్సావాలలో ఈ మూవీ ప్రదర్శితం కావాల్సిన అవసరం ఉంది.
ఈ నేపధ్యంలో రాజమౌళి సినిమాని ఫారిన్ భాషలలో కూడా రిలీజ్ చేస్తూ హాలీవుడ్ స్థాయిలో అందరికి చేరువ చేస్తున్నారు. మరో వైపు ఆస్కార్ అవార్డుల కంటే ముందుగా పలు అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులకి కూడా ఆర్ఆర్ఆర్ సినిమాని పంపించడంతో పాటు అవార్డులని సైతం దక్కించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డుని ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను రాజమౌళి ఎంపిక అయ్యాడు. ఇది ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చిన మొదటి ఇంటర్నేషనల్ అవార్డు కావడం విశేషం.
ఇక తాజాగా హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ బెస్ట్ స్పాట్ లైట్ అవార్డుకి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న వాటిలో 43 శాతం సినిమాలు ఆస్కార్ అవార్డులని అందుకోవడం విశేషం. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు రావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ఇక బెస్ట్ స్పాట్ లైట్ అవార్డుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 లాస్ ఏంజెల్స్ లో రాజమౌళి అండ్ టీం అందుకోనుంది. ఇక ఆస్కార్ అవార్డు అందుకునే మార్గానికి ఆర్ఆర్ఆర్ దగ్గర అయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళిన ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా సత్తా చాటితే మాత్రం భవిష్యత్తులో ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి సినిమాలు ఎంపిక చేసే క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తమ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటుంది అనే మాట వినిపిస్తుంది.