Parents: నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి పెంచి పెద్దవాడిని చేసేది అమ్మ, తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఆ బిడ్డకు కావాల్సిన అన్నిరకాలైన సదుపాయాలను సమయానుకూలంగా అందిస్తూ వెనకుండి కుటుంబాన్ని నడిపించేవాడు నాన్న. అమ్మ నాన్న ఈ రెండు పదాలు ప్రతి మనిషికి ఎంతో అవసరం. వారిద్దరూ లేకపోతే ఆ బిడ్డ భవిష్యత్తు అగమ్యగోచరం. రేపు మనకు తిండి పెట్టడేమో, మన ఆలనా పాలనా చూసుకోడేమో అన్న ఆలోచనే గనుక వస్తే ఈ నాడు మనం బ్రతికే బ్రతుకుకు ఓ అర్థం ఉండదు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం పిల్లల బాగోగుల కోసమే వారి బంగారు భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు నిరంతరం కృషి చేస్తుంటారు. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా బిడ్డలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఆ తల్లిదండ్రులకు బంగారంగానే కనిపిస్తాడు.
అందుకే దేవుని కంటే ముందే తల్లిదండ్రులకు స్థానాన్ని కల్పించింది సమాజం. తల్లిదండ్రుల కంట నీరు తెప్పించకుండా ఏ బిడ్డ చూసుకుంటాడో వాడు నిజంగా దేవుడికి పూజ చేసినవాడితో సమానం అని అంటారు. కానీ ఆ తల్లిదండ్రులే నేడు పిల్లలకు భారం అవుతున్నారు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. లోపం ఎక్కడుంది? పెంపకంలోనా? పిల్లల మనస్తత్వంలోనా? లేదా సమాజందా?. ఒకప్పుడు మీకోసం తమ జీవితాన్ని, ఆశలను పనంగా పెట్టిన తల్లిదండ్రలను పిల్లలు ఎందుకు వారిలా చూసుకోవడం లేదు..?
మలి వయస్సులో పెద్దలకు కావాల్సింది కాస్త ప్రేమ వారితో సాన్నిహత్యం. కానీ నేడు అవి కాదు కదా కనీసం వారికి ఉండటానికి నీడను కూడా కల్పించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు పిల్లలు. వయస్సు పైబడిన వారిని భారంగా ఫీల్ అవుతూ వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దిక్కులేని వారిలా వారిని గాలికి వదిలేస్తు న్నారు. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా నే ఉన్నాయి మన భారతదేశంలో అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆప్యాయంగా ఉన్న పిల్లలు పెళ్లై పిల్లలు పుట్టగానే వారి ప్రేమ వారిపై మళ్లుతుంది. అందులో తప్పేమి లేదు.
కానీ తమని పెంచి ఇంత వారిని చేసిన కన్న తల్లిదండ్రుల బాధ్యతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ఇంటి పట్టున ఉండే చాలా మంది పెద్ద వారు నేడు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. వారు సంపాదన లేకపోవడంతో పిల్లలు వారిని చులకనగా చూస్తున్నారు. నిజానికి ఇక్కడే పిల్లలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. గడిచిన 25 ఏళ్ల వరకు లేదా ప్రయోజకుడిగా మారే వరకు నువ్వు తల్లిదండ్రులకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు కదా. వారే కదా నీకు కావాల్సినవన్నీ సమకూర్చింది. ఆ లెక్కన ఆలోచిస్తే నువ్వు నీ తల్లిదండ్రులను కాటి వరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే కదా. ఇంతటి సున్నితమైన విషయాన్ని పిల్లలు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు.
చాలా మంది కుటుంబాల్లో అత్తా మామలతో కోడళ్ళ కు తగాదాలు ఏర్పడుతు న్నాయి. అత్తా మామలు కోడళ్లకు వంకలు పెడుతుంటారు. కానీ కోడళ్లు ఆ మాటలను తీసుకోలేరు. కారణం ఏమిటో ఇప్పుడు కాదు కదా ఎప్పటికి దొరకదు. ఎంతుకంటే అత్త అత్తే అమ్మ అమ్మే అన్న సామెత లాగా. అమ్మ ఎన్ని మాటలన్నా పడే అమ్మాయి. అదే అత్త అంటే భూతద్దంలో పెట్టి చూస్తుంది. కానీ ఇక్కడే ఆ అత్తను తల్లిలాగా భావిస్తే ఏ కుటుంబంలోనూ కలతలు, కోపాలు, తాపాలు ఉండవు. ఎప్పుడైతే కోడళ్లు తమ అత్తామామలను తల్లిదండ్రుల్లా స్వీకరిస్తారో అప్పుడు ఆ ఇళ్లు ఓ స్వర్గసీమ అవుతుంది.
అంతే కాదు ఏ అత్తా మామ అయినా తమ కోడళ్లను కూతుర్లుగా చూస్తారో వారి ఇళ్లు సంతోషాలకు నిలయంగా మారుతుంది. ఇప్పటి వరకు కోడళ్ల గురించి మాట్లాడాము కదా ఇప్పుడు అత్తామామల గురించి చర్చిద్దాం. చాలా మంది అత్తా మామలు కాస్త వయస్సు పైబడగానే మేము ఏదో ఉద్దరించేశాము. మా బాధ్యత మీది మమ్మల్ని చూసుకోకపోతే కోర్టులో కేసు వేస్తాము అని బ్లాక్‌మెయిల్ చేసేవారు లేకపోలేదు. ఎక్కడో అక్కడ ఇలాంటి తల్లిదండ్రలు ఉంటారు. పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి దారి చూపని వారు కూడా నేడు కాలు మీద కాలు వేసుకుని మీరు మమ్మల్ని ఇలా చూడాలి అంటూ కమాండింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని కాస్త ఓపికతో భరించాల్సిందే పిల్లలు. ఎంతైనా వారు మీ తల్లిదండ్రులు కాబట్టి. ఏది ఏమైనా వీరు మనకు భారం అని తల్లిదండ్రులు ఏ మాత్రం అనుకున్నా ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉండేవారము కాదు. అందుకే పిల్లలు కూడా తల్లిదండ్రులను చంటి పిల్లల్లా చూసుకోవాలి. అప్పుడప్పుడు తగాదాలు వస్తుంటాయి. కానీ కాస్త ఓపిక పట్టి సర్దుకుపోవాలి. లేదా పెద్దవారితో చెప్పించి సమస్యను పరిష్కరించాలి.
ఇక ఇంకొంత మంది తల్లిదండ్రులు పిల్లలతో ఉండటం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఈ మధ్య కాలంలో ఓల్డేజ్ హోమ్స్‌కు వెళ్లిపోతున్నారు. అక్కడ వారి తోటి వయస్సువారితో హాయిగా కలిసిమెలిసి ఉంటున్నారు. నెలకింత అని చెల్లిస్తే చక్కగా ఇంట్లో ఏ విధమైన వాతావరణం ఉంటుందో అదే విధంగా ఈ హోమ్‌లో కల్పిస్తున్నారు ఓల్డేజ్ హోం నిర్వాహకులు. నిజానికి ఓల్డేజ్ హోమ్స్ అనేవి మలి వయస్సు వారికి ఓ కాలక్షేప నిలయాలుగా మారుతున్నాయి. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వడం, లేదా పిల్లలతో కలిసి ఉండలేని వారు.
లోన్లీగా ఫీల్ అయ్యేవారికి ఈ హోమ్స్ ఎంతగానో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. అయినంత మాత్రాన తమ తల్లిదండ్రులను ఇక్కడ చేర్చమని కాదు. వారు కోరుకుంటేనే. మీరు చేసేదల్లా తల్లిదండ్రులను భారంగా ఫీల్ అవ్వకండి. రోజులో కాస్త సమయాన్ని వారి కోసం కేటాయించండి. తిన్నావా అని ఒక్క మాట అడగండి. చాలు వారి కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ వయస్సులో తల్లిదండ్రులు కోరుకునేదేమిటి కడుపునిండా ఆహారం, కంటినిండా నిద్ర, అలసిన దేహం కాస్త విశ్రాంతిని మనవళ్లతో కాస్త ఆహ్లాదాన్ని తప్ప. నేడు మన తల్లిదండ్రులను భారంగా భావిస్తే రేపు మన పిల్లలు మనల్ని అదే కోణంలో చూడరని ఏంటి నమ్మకం. అందుకే తల్లిదండ్రులతో ప్రేమగా గడుపుతూ ప్రతి ఒక్కరం హాయిగా జీవితాన్ని కొనసాగిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్.