AP Politics: రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని వైసీపీ, టీడీపీ పార్టీలు బలంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వారు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా సంక్షేమ పథకాలతోనే ప్రజలు తమకి ఓట్లు వేస్తారని భావిస్తున్న జగన్ వై నాట్ 175, వై నాట్ కుప్పం అంటూ క్యాడర్ ని ఉత్సాహ పరుస్తూ ఉన్నారు. గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలలో 98 శాతం నేరవేర్చామని, అవే మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొని వస్తాయని జగన్ అంటున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో గెలవాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా అదే నినాదం అందుకున్నారు వై నాట్ పులివెందుల అంటూ క్యాడర్ కి పిలుపునిస్తున్నారు. రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలుచుకున్నాం కాబట్టి పులివెందులలో కూడా గెలవడానికి స్కోప్ ఉందని అంటున్నారు. అలాగే అధికార పార్టీ వైఫల్యాలని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే కచ్చితంగా 175 నియోజకవర్గాలలో మనమే గెలుస్తాం అంటూ క్యాడర్ ని చెబుతున్నారు. వైసీపీని 0కి పరిమితం చేయాలంటూ పిలుపునిస్తున్నారు.
ప్రజలందరూ వైసీపీ పాలనని గ్రహించాలని, రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా మారిపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా మారడానికి వైసీపీ విధానాలే కారణం అని చెబుతున్నారు. అధికార పార్టీ మీద నిజంగానే వ్యతిరేకత ఉంది. టీడీపీ ఓటరిగా పోటీ చేస్తే 175 సాధ్యం కాకపోవచ్చేమో కాని జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా ఆ నెంబర్ కి రీచ్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వై నాట్ 175 అనే నినాదంలో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి.