Spirtual: సనాతన ధర్మంలో ఎంతో మంది దేవతలు ఉంటారు. వారికి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలలో చాలా వరకు అడవులలో, లేదంటే కొండలపైనే ఉంటాయి. కొన్ని ప్రమాదపు అంచుల మాటున ఉన్న కూడా హిందువులు ఆ దేవాది దేవుళ్ళని దర్శించుకోవడానికి ఆలయాలకి తరలి వెళ్తారు. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే శ్రీనివాసుడి సన్నిధానం తిరుమల తిరుపతి కూడా కొండపైనే ఉంది. ఇలా కొండల్లో వెలిసిన చాలా ఆలయాలు వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది.
సాక్షాత్తూ ఆ దేవాది దేవుళ్ళు స్వయంభుగా వెలసిన ఆలయాలే అన్ని కూడా. ఆ ఆలయాలకి ప్రత్యేకంగా స్థల పురాణాలు కూడా ఉంటాయి. ఇలా ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అయితే హిందూ ఆలయాలు అన్ని కూడా కొండలపైనే ఎక్కువగా ఎందుకు ఉంటాయని చాలా మందికి అనుమానం వస్తుంటుంది. జనావాసం ఉండే ప్రాంతాలలో కాకుండా కొండలలో ఆ దేవుళ్ళు కొలువై ఉండటానికి కారణం ఏమిటి అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అయితే ఇలా కొండల్లో, అడవుల్లో దేవతలు కొలువై ఉండటానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతున్న మాట.
అడవులలో పంచభూత శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రకృతి వరప్రసాదంగా మానవ రహితంగా అడవులు అన్ని కూడా వాటికవే పురుడుపోసుకున్నాయి. అక్కడ ఎలాంటి మానవ శక్తి ప్రమేయం ఉండదు. అలాంటి పంచభూత శక్తి అధికంగా ఉండే అడవుల్లోకి ఒకప్పుడు మునులు, మహర్షులు, రాజులు తపస్సు కోసం వెళ్ళేవారు. అక్కడే భగవత్ సాక్షాత్కారం పొందేవారు. పంచభూత శక్తి నిక్షీప్తమై ఉన్న ప్రాంతంలో దైవశక్తిని ఆవాహనం చేయడం ఎంతో సులభం . అలాగే అడవులలో ఉంటే ఇంద్రియనిగ్రహం కూడా సాధ్యం అవుతుంది. ఈ కారణం చేతం మహర్షులు అడవులలోనే నివసిస్తూ అక్కడే తపస్సులు చేసేవారు.
అలా తపస్సు చేసిన మహర్షులు చాలా మంది తమకి ఇష్టదైవాన్ని ఆరాధించి, దైవసాక్షాత్కారం తర్వాత మోక్షాన్ని ప్రసాదించమని, అలాగే తమపైనే కొలువై ఉండమని కోరుకునేవారు. అలా అడవులలో ఉండే చాలా పర్వతాలు మహర్షుల సంకల్పబలంతో, దైవానుగ్రహంతో పర్వతాలుగా మారిపోయారు. అలా మారిపోయిన పర్వతాలపై మహర్షుల ఇచ్చిన వరబలం కారణంగా కొలువై ఉన్నారు. ఈ కారణంగానే హిందూ దేవాలయాలు అన్ని కూడా అడవులలో కొండలపైనే ఎక్కువ ఉన్నాయి. ఇక కొండలపై ఉండటానికి మరొక కారణం కూడా ఉందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. దైవదర్శనం అనేది మానవులకి సులభంగా దొరికేస్తే దైవశక్తిని వారు అర్ధం చేసుకోలేరు. ఈ కారణం చేస్తే తమ దర్శనం కోసం వచ్చే భక్తుల సహన శక్తి, సంకల్ప బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా భగవంతుడు కొండలని తమ ఆవాసంగా మార్చుకున్నారని ఒక విశ్వాసం ఉంది.