Political news: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా జాతీయ పార్టీని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో తన టీఆర్ఎస్ పార్టీ పేరుని మార్చారు. ఇలా మార్చడం ద్వారా దేశ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నా అని చాలా కాలంగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలని నిజం చేశారు. ఎప్పటి నుంచో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారి ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటూ ఉంటే కేసీఆర్ మాత్రం ఎక్కడి బాధ్యతలని కొడుకు కేటీఆర్ కి అప్పగించి దేశ రాజకీయా లలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు.
ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కలుపుకొని కాంగ్రెస్, బీజేపీయేతర శక్తిగా మారాలని అనుకుంటున్నారు. దానికోసం ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పర్యటించి జాతీయ పార్టీల రెండింటికి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని ఏకం చేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు థర్డ్ ఫ్రంట్ అటూ కొంతకాలం పావులు కదిపే ప్రయత్నం చేశారు. అయితే అవి ఫలించలేదు. ప్రాంతీయ పార్టీల మధ్యలో ప్రధాని పీఠంపై ఎవరికి వారు ఆశలు పెట్టుకోవడంతో అదిపూర్తిగా చెడిపోయింది. ఆ తరువాత చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు స్థానం తీసుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఆ రెండు బలమైన జాతీయ పార్టీలకి ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే నిర్ణయాధికారం మన చేతులో ఉండాలనే అభిప్రాయంతో తానే జాతీయ పార్టీని ఎనౌన్స్ చేశారు. ఇక ఈ పార్టీని ముందుగా ఏపీలో విస్తరించాలని భావిస్తున్నారు. అందుకుగాను విజయవాడని వేదికగా చేసుకొని భారీ బహిరంగ సభ పెట్టడానికి సిద్ధం అయ్యారు. ఏపీలో చాలా మంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు. అలాగే టీడీపీ, వైసీపీ, జనసేనకి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నాయకులని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది.
అలాగే కొంత మంది నాయకులు ఇప్పటికే కేసీఆర్ తో సంప్రదింపులు జరిపి విజయవాడ వేదికగా పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చీల్చడానికి ప్రాంతీయ పార్టీలని కలుపుకొని కేసీఆర్ ఈ కొత్త డ్రామాకి తెరతీశారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో తమకి వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారు. అయితే రానున్న ఎన్నికలలో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోయే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎవరిపై ఏ స్థాయిలో ఉంటుందనే దాని మీద రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేయడం మొదలు పెట్టారు.