Politics: ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఎవరికీ వారు తమ రాజకీయ వ్యూహాలతో ముందుకి పోతున్నారు. గెలుపు ఓటములు అనేవి ఎవరిని వరిస్తాయనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ప్రజలని ఆకట్టుకోవడానికి పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఆయా పార్టీలు వాడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ సంక్షేమం నమ్ముకుంటే, ప్రతిపక్ష టీడీపీ సొంతబలంతో పాటు వ్యతిరేక ఓటుని నమ్ముకున్నారు. ఇక జనసేనాని తన సామాజికవర్గంతో పాటు యువత, మార్పు కావాలని కోరుకునే న్యూట్రల్ పబ్లిక్ ఓటర్లని నమ్ముకున్నారు.
అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు కూడా తనకి అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకి మరో ఏడాదిన్న సమయం ఉంది. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది. వచ్చే ఏడాది నుంచి కొత్త కొత్తవారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వారు మళ్ళీ పోటీ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళందరూ తమ ఇష్టాన్ని బట్టి ప్రధాన పార్టీలైన మూడింటిలో ఏదో ఒక పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది.
రాజకీయాలలో అడుగుపెట్టాలని అనుకుంటున్న యువ వ్యాపారవేత్తలు జనసేన వైపు చూస్తున్నారు. అలాగే కొంత మంది సీట్లు వస్తాయని కన్ఫర్మ్ అయితే వైసీపీ వైపు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తమిళంలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న తెలుగు నటుడు విశాల్. అక్కడ కమర్షియల్ హీరోగా విశాల్ రాణిస్తున్నాడు. అలాగే నిర్మాతల మండలి, ఆర్టిస్ట్ అసోసియేషన్స్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ రాజకీయాలు నడుపుతున్నాడు. విశాల్ తండ్రి ఏపీకి చెందిన పెద్ద మైనింగ్ వ్యాపారవేత్త అనే సంగతి అందరికి తెలిసిందే. విశాల్ హీరోగా రాణిస్తూ ఉండటంతో, ఆ వ్యాపారాలని విశాల్ అన్న చూసుకుంటున్నాడు.
విశాల్ సొంత జిల్లా చిత్తూరు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో ఏపీ రాజకీయాలలో చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అరంగేట్రం చేయడానికి విశాల్ సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. తాజాగా తిరుపతిలో విశాల్ కొత్త చిత్రం లాఠీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో కచ్చితంగా రాజకీయాలలోకి వస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే తమిళనాడు ఎన్నికలలో విశాల్ కి పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఏపీలోనే అతను రాజకీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
జగన్ తన అభిమాన రాజకీయ నాయకుడు అని విశాల్ చెప్పారు. త్వరలో జగన్ ని కలుస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే కుప్పంలో ప్రస్తుతం తాను పోటీ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. వైసీపీ నుంచి విశాల్ కుప్పం అభ్యర్ధిగా బరిలోకి దిగుతాడని ప్రచారం నడిచింది. అయితే కుప్పం ఎమ్మెల్యే అభ్యర్ధిగా భరత్ ని జగన్ రెడ్డి ప్రకటించారు. అయితే 2024 ఎన్నికల తర్వాత విశాల్ వైసీపీ పార్టీ నుంచి ఏపీలో రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన మాటలబట్టి అర్ధం అవుతుంది.