Vani Jairam : తన గాత్రంతో, మధురమైన గానంతో ప్రేక్షకులను మరోలోకానికి తీసుకువెళ్లిన ప్రముఖ గాయని పద్మభూషణ్ లెజండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జైరామ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. క్లాసైనా, మాసైనా, పాప్ అయిన జాజ్ అయినా ఏ పాటనైనా అనర్గలంగా పాడగాల ఆమె గాత్రం ఇకపై వినిపించదన్న చేదు వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నైలోని నుంగంబాక్కంలోని హాడోస్ రోడ్‌లోని తన నివాసంలో తన తుది శ్వాసను విడిచారు 78 ఏళ్ల వాణీ జైరామ్.
వాణీ జైరామ్ వివిధ పరిశ్రమలలోని కొన్ని అతిపెద్ద స్వరకర్తలతో కలిసి పనిచేశారు. తన కెరీర్‌లో ఎన్నో ఎవర్‌గ్రీన్ పాటలను ప్రేక్షకులకు అందించారు. వాణీ జైరామ్ ప్రతిభావంతులైన గాయనీమణుల్లో ఒకరు. కొత్త పాట ఏది వచ్చినా ప్రయోగం చేయాలంటే వాణీ ముందుండాల్సిందే. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, తుళు , ఒరియా ఇలా 14 కుపైగా భాషలలో అనేక పాటలను తన మధురమైన గాత్రంతో పాడారు వాణీ. స్వదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను అలరించారు. ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డులను మూడుసార్లు గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం. ఆమె తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి అనేక రాష్ట్ర అవార్డులను కూడా పొందారు.
వాణీ జైరామ్ ఇటీవలే ప్రొఫెషనల్ సింగర్‌గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దాదాపు తన కెరీర్‌లో భక్తిగీతాలు , ప్రైవేటు ఆల్బమ్‌లు, సినిమాలతో కలిపి 10వేల కంటే ఎక్కువ పాటలను పాడిన సింగ్గా ర్ రికార్డ్ సృష్టించారు. ఇళయరాజా, బర్మన్, కె.వి.మహదేవన్, ఓ.పి. నయ్యర్ , మదన్ మోహన్ వంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. ఆమెకు ఇటీవల పద్మభూషణ్ అవార్డును సైతం అందించి ప్రభుత్వం సత్కరించింది.
వాణీ జైరామ్ తమిళనాడులోని వెల్లూరులో కలైవాణిగా నవంబర్ 30, 1945న దురైసామి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆమె తన భర్త జయరామ్‌ను వివాహం చేసుకుని సంగీతానికి మద్దతు ఇచ్చే కుటుంబంలోకి చేరారు. అత్తగారు పద్మా స్వామినాథన్ ప్రసిద్ధ కర్నాటక గాయని , సామాజిక కార్యకర్త. దీంతో ఆమెకు సంగీతంపై మమకారం ఏర్పడింది అలా ముంబైకి వెళ్లి గజల్ ,భజన్ వంటి స్వర రూపాలను నేర్చుకోవడంతో పాటు శాస్త్రీయ సంగీతంపై పట్టు సాధించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.