TS Politics: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి అంటే ఏపీలోనే అని ఎవరైనా చెబుతారు. అయితే అంతకు మించిపోయే విధంగా గత కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య వరం తారాస్థాయికి చేరుకుంటుంది. రానున్న ఎన్నికలలో తెలంగాణలో ఎలా అయిన అధికారంలోకి రావడానికి పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా తన కార్యాచరణని ముందుకి తీసుకొని వెళ్తుంది. కేసీఆర్ కూతురు కవిత ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. దీనిపై ఈడీ విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ అంతా బీఆర్ఎస్ పై కక్షసాదింపు చర్యలలో భాగమే అని విమర్శలు చేస్తున్నారు.
అయితే అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక విచారణకి రావాలని ఈడీ కవితకి నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమె మహిళ రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలి అంటూ నిరసన దీక్షకి కూర్చుంది. మరో రెండు రోజుల్లో ఆమెని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంగా ఆమె కొత్త ఎత్తు వేసి ఇలా బీజేపీ పోరాటం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్ని ఎత్తులు వేసిన కూడా తప్పుచేసిన వారు తప్పించుకోలేరని బీజేపీ నేతలు అంటున్న మాట. ఇక కవిత బీనామీ అని చెబుతున్న పిళ్ళై ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్నారు.
అతనిని విచారిస్తున్నారు. తాను కవిత బినామీ అని ఈడీ వాంగ్మూలంలో ఒప్పుకున్నారు అనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో కవిత అరెస్ట్ తధ్యం అనే ప్రచారం అన్డుస్తుంది. ఇదంతా కేవలం రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ ని దెబ్బ తీసే కుట్రలో భాగమే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ కూడా పార్టీ నాయకులు అందరితో అత్యవసర భేటీ పెట్టారు. ఒక వేళ కవితని అరెస్ట్ చేస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకి వెళ్ళాలి అనే విషయంపై నాయకులు అందరికి దిశా నిర్దేశ్యం చేయనున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.