Political: మునుగోడు ఉప ఎన్నికని అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేసి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ తన పదవిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డిని గెలిపించడం ద్వారా తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికలో ఎలా అయిన గెలిచి తమ ఖాతాలో మరో ఎమ్మెల్యే పదవిని వేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది.
దీనికోసం ఆ పార్టీ నుంచి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తూ మునుగోడు వ్యవహారాలు అన్ని చక్కబెడుతున్నారు. ఇక ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా మెయిన్ ఫోకస్ అంతా టీఆర్ఎస్, బీజేపీ మీదనే ఉంది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీల వైపే చూస్తున్నారు. ఒక ఓటుకి భారీగా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఉన్నపళంగా మంగళవారం రాత్రి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టి కొనడానికి ప్రయత్నం చేయడం.
పోలీసులు ఆ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టే స్వామీజీలని రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ తతంగం అంతా మొయినాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికంగా కేంద్రం నుంచి కొంత మంది పెద్దల మార్గదర్శకంలో ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. దీనిపై పోలీసులకి ముందుగానే సమాచారం ఉండటంతో పక్కా స్కెచ్ తో దీనిని రికార్డ్ చేసి నిందితులని అరెస్ట్ చేశారు.హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టి వారిని బీజేపీ పార్టీలో చేరాలని కోరినట్లు తెలుస్తుంది.
ఇక వారితో సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌ల సంప్రదింపులు జరిపారు. ఇక కేంద్ర పెద్దలతో ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం కూడా వీరు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆధారాల కోసం రికార్డ్ చేసినట్లు సమాచారం. గంటన్నర పాటు రికార్డ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన వారి చరిత్రని కూడా తవ్వితీసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది.
ఇక ఈ ఇష్యూ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు ఎమ్మెల్యేలతో ప్రగతిభవన్ లో అత్యవసరంగా భేటీ అయ్యి వారిని ప్రశంసించారు. ఇదిలా ఈ ఎపిసోడ్ కి కథ, స్క్రీన్ ప్లే అంతా టీఆర్ఎస్ నాయకులదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కావాలని ఈ నాటకానికి తెరతీసి బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా తమదైన సహకారం అందించారని ఆరోపిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ముందు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వ్యవహారం మునుగోడు ప్రజలపై, ఎన్నికల ఫలితంపై ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందనేది చూడాలి.