Tue. Feb 10th, 2026

    Tirumala: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్‌లపై కేంద్ర ప్రభుత్వం తరచూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగాలని ఉద్దేశించిన ఈ చర్యలు, మరోవైపు వాహనదారులపై భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం అన్ని టోల్ ప్లాజాలలో వాహనాల నుంచి ఫాస్టాగ్‌ విధానంతో టోల్ వసూలు జరుగుతున్నా, వాస్తవంగా వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు.

    ఫాస్టాగ్ రీడర్లు పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి తరచూ జరుగుతుండటంతో, కొన్ని సందర్భాల్లో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు క్యూల్లో నిలబడుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా కూడా రాకపోకలు అంత సజావుగా లేవన్న అభిప్రాయం కేంద్రానికి వచ్చింది. దీంతో కేంద్రం కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

    ఇకపై వాహనదారులకు వార్షిక టోల్ పాస్‌ సౌకర్యం లభిస్తుంది. దీని ధర రూ.3,000గా నిర్ణయించబడింది. పాస్‌ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 ట్రిప్పుల వరకు ఇది చెల్లుతుంది. అయితే ఈ సదుపాయం కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు) మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్‌ వర్తించదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానున్నట్టు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

    tirumala-the-centers-key-decision-on-toll-passes-fastag-is-mandatory
    tirumala-the-centers-key-decision-on-toll-passes-fastag-is-mandatory

    Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. 

    ఇదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ నెల 15 నుంచి అలిపిరి చెక్‌పోస్ట్ వద్దకు వచ్చే అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ ఉండాలి. భద్రత, రద్దీ తగ్గింపు, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమల గిరి ప్రాంతంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.

    అదేవిధంగా ఫాస్టాగ్ లేని వాహనదారుల కోసం అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ భక్తులు తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ పొందవచ్చు. దానిని పొందిన తర్వాత మాత్రమే వాహనాలతో తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయంలో సహకరించాలని కోరింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.