The Elephant Whisperers: ఈ ఏడాది ఆస్కార్ వేడుకలలో చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఏకంగా రెండు సినిమాలు ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాయి. ఇక ఫీచర్ ఫిల్మ్ విభాగంలో రాజమౌళి సృష్టి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డుతో దేశం మొత్తం పండగ చేసుకుంటుంది. ఇదే సమయంలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తమిళనాడులోని క్రిష్ణగిరి ఫారెస్ట్ సమీపంలో ఇద్దరు దంపతుల కథగా చూపించారు. అడవిలో తల్లి నుంచి తప్పిపోయిన రెండు పిల్ల ఏనుగులని వారు చిన్నప్పటి నుంచి ఎలా పెంచి పెద్ద చేశారు అనే అంశాలని ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు.
అడవుల పరిరక్షణ, సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ని గునిత్ మోంగా నిర్మించింది. కార్తీకి అనే మరో మహిళ ఈ సినిమాని తెరకెక్కించింది. ఆమెకి ఇదే మొదటి మూవీ అయిన అద్భుతంగా ఆవిష్కరించి ఆస్కార్ అకాడమిని మెప్పించింది. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డు పొందడంతో ఈ రెండు ఏనుగులు ఇప్పుడు చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘు, అమ్ము అనే ఏనుగులను చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అనాధలుగా దొరికిన ఈ రెండు ఏనుగులను బొమ్మన్ దంపతులు పెంచి పెద్ద చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు ఏనుగులు తప్పిపోయినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని క్రిష్ణగిరి అడవులో ఏనుగులు రెండు మిస్ అయ్యాయని వాటిని పెంచిన బొమ్మన్ తెలియజేశారు. కొంతమంది తాగుబోతులను తరుముకుంటూ వెళ్లి అవి అడవిలో మిస్ అయినట్లుగా తెలిపారు. ఇప్పుడు వాటిని వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బొమ్మన్ దంపతులని పిలిపించి వారికి సన్మానం చేశారు. ఇదిలా ఉంటే తప్పిపోయిన ఏనుగులని వెతకడంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుంది అని తెలుస్తుంది.