Telangana Culture and Tradition : భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ రాష్ట్రానికి అంతే చరిత్ర ఉంది. అందుకే ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పండుగలను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలు ఆచరిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు తెలంగాణ సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొన్ని పండుగ లను రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేసింది. ఇప్పుడు జరిగే గ్రూప్ 1, గ్రూప్ 2, టెట్ వంటి పరీక్షల్లోనూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తెలంగాణ పండుగలు, సంస్కృతి సాంప్రదాయలపైన కొద్ది పాటి అవగాహన తప్పనిసరి మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించిన విషయాలను మనమూ తెలుసుకుందాం పదండి.
దేశంలో ఉన్నా 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశాని కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కొన్ని రాష్ట్రాలు ఇండిపెండెంట్ రాజ్యాలుగా కొనసాగాయి. అందులో హైదరాబాద్ కూడా ఉంది. 1948లో సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 1956లో భాషల ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు జరిగి చర్యల్లో భాగంగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తరువాత 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం మొదలు కాగా 2011లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రజలు మాట్లాడేది తెలుగే కానీ వీరి భాషలో అక్కడక్కడ ఉర్దూ పదాలు కలుస్తాయి.
తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. కాలాలు మారుతు న్నా ఆధునికత పెరుగుతున్నా ఇక్కడి ప్రజలు వారి వారి సంస్కృతిని పండుగ లను జరుపుకుంటూ వాటి విశిష్టతను భవిష్యత్తు తరాలకు చెబుతుంటారు. ఎన్నో పండుగలు తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రజల పండుగల్లో ప్రకృతి యొక్క ప్రాధాన్యత తప్పనిసరిగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. బోనాలు, బతుకమ్మ, నాగోబా జాతర, సమ్మక్క సారక్క జాతర, పీర్ల పండుగలు మొదలైనవి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగే పండుగలు.
ఆషాడమాసం వచ్చిందంటే చాలు అమ్మలక్కల సందడి మొదలువుతంది. తమ ఆరాధ్య దైవమైన శక్తి స్వరూపిణి అయిన మహంకాళి అమ్మవారికి తమ శక్తి కొద్ది బోనాన్ని సమర్పించి కోరికలు కోరుకుని దైవారాధన చేస్తుంటారు. తెలంగాణలో ఊరూరా అత్యంత వైభవంగా ఓ వేడుకగా ఈ పండుగ జరుగుతుంది. ప్రతి ముత్తైదువు ఇంట్లో అన్నంతో నైవేద్యం చేసి కుండలను అందంగా పసుపు కుంకుమ లతో అలంకరించి వేపాకులు, దీపాలు పెట్టి కుండలో నైవేద్యం పెట్టి, కల్లుసాక పోసి అమ్మవారికి సమర్పిస్తారు. బాజా భజంత్రీలు, పోతురాజుల విన్యాసాలతో, ఉరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. గ్రామ గ్రామాన ఉన్న అమ్మవార్లకు ఆషాడమాసంలోనే బోనాలను సమర్పించి తమను చల్లగా చూడాలని మహిళలు వేడుకుంటారు.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో గోల్కొండ కోటలో కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లి నుంచి ఈ బోనాల సమర్పణ కొనసాగుతుంది. మొదటి ఆదివారం మహిళలంతా గొల్కొండ ఎల్లమ్మకు బోనం సమర్పిస్తారు. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు కుతుబ్‌షాహీల కాలం నుంచే గోల్కొండలోని అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో బోనాలు సమర్పించడం జరుగుతోంది. తరువాత ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆ తరువాత పాతబస్తీలోని లాల్‌దర్వాజలో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
మహిళలు ఎంతో ఇష్టంతో జరుపుకునే మరో పండుగ బతుకమ్మ. ఈ పండుగ ప్రకృతి పండుగ, పూలను ఆరాధిస్తూ జరుపుకునే పండుగ ఇది. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పండుగ. ప్రతి రోజు తీరొక్క పూల తో గౌరీ దేవిని ఆరాధిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహిస్తుంటారు. బతుకమ్మలు పేర్చేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు పోటీ పడుతుంటారు. ఇలాంటి పండుగ ఏ దేశంలోనూ కనిపించదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ.
ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్ది బతుకమ్మ వరకు ప్రతి రోజు విభిన్న పూలతో బతుకమ్మలను పేర్చి నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. దసరా సందర్భంగా జరిగే ఈ పండుగ లో యువతులు పట్టు పరికిణీలు, బంగారు ఆభరణాల తో అలంకరించుకుని బతుకమ్మ పాటలను పాడుతూ ఎంతో ఉత్సాహంతో ఉంటారు. ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 2014 సంవత్సరంలో అక్టోబర్ 2వ తారీఖున మొదటి సారిగా అధికరికంగా బతుకమ్మ పండుగును నిర్వహించింది.
ఇక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో అత్యంత వైభవంగా సమ్మక్క-సారక్క జాతర జరుగుతుంది. భారత దేశంలో జరిగా అతి పెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక్క జాతరకు ఖ్యాతి లభించింది. ఈ జాతరకు స్థానికులే కాదు దేశ విదేశాల నుంచి యాత్రికులు వచ్చి తిలకిస్తుంటారు. గద్దెలపై కూర్చున్న వీరనారీమనులకు బంగారాన్ని సమర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. ఎలాంటి విగ్రహాలు లేకుండా జరిగే అతి పెద్ద జాతర ఇది.. ఇదే ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకత. ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ మేడారం జాతరను రాష్ట్ర సీఎం బాజా భజంత్రీలతో లాంఛనాలతో ప్రారంభిస్తారు. ఈ జాతరకు వచ్చే వారు అక్కడే బస చేసి అమ్మవారికి బంగారాన్ని సమర్పించి ఇంటిళ్లిపాది అక్కడే వండుకుని తిని అమ్మవార్ల సన్నిధిలో నిద్ర చేసి వెలుతుంటారు.
ఇక గోండు గిరిజనులు జరుపుకునే అతి ప్రాచీణమైన జాతర నాగోబా జాతర. ఈ జాతరను ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్ల, కేస్లాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతంది. ఈ జాతర అంటే అక్కడి గిరిజనులకు న్యూ ఇయర్ లాంటింది. తమ సన్నిహితులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంతో ఈ జాతరను జరుపుకుంటారు. ఈ జాతర సందర్భంగా ప్రధానంగా గోండు గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రకృతిని కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో జరిగే పండుగ కావడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండుగను గుర్తించింది. ఈ జాతరకు ఆదిలాబాద్ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు.