Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని ప్యాకేజీ స్టార్ అంటూ పదే పదే రెచ్చగొడుతుంది. చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, ఆలోచనలు అన్ని కూడా టీడీపీ తనకి అనుకూలంగా మార్చుకుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే రాజకీయాలు చేస్తున్నారా అంటే అవుననే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. 2014లోనే పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లి ఉంటే కచ్చితంగా ఈ రోజు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవాడని అందరూ భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేయకుండా కేవలం చంద్రబాబు, బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించాడు.
తరువాత కూడా 2019 ఎన్నికల సమయంలో ముందు చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ చివరి మూడు నెలల్లో స్టాండ్ మార్చుకొని వైసీపీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దీనిని వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా ఉపయోగించుకొని టీడీపీ దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అంటూ ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. టీడీపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం చేశారు. దీనిని ప్రజలు బలంగా నమ్మారు. దీంతో జనసేనకి రావాల్సిన చాలా ఓట్లు వైసీపీకి టర్న్ అయిపోయాయి. అయితే మరల 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అద్బుతమైన అవకాశాలు ఉన్నాయి.
చంద్రబాబు, జగన్ పాలన ప్రజలు చూసేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అనే మాట ప్రజల నుంచి వస్తుంది. అయితే దీనిని అవకాశంగా మార్చుకొని బలంగా ప్రజలలోకి వెళ్ళడంలో మాత్రం పవన్ కళ్యాణ్ విఫలం అవుతున్నాడు అనే మాట వినిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీలు బలంగా కొట్లాడుకుంటున్నాయి మూడో వ్యక్తిగా ప్రజల మద్దతు దొరుకుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉండటంతో పాటు తెలుగుదేశంతో పొత్తు మంత్రం జపిస్తున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు తన అనుకూల మీడియాతో పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేశాడు అంటూ విమర్శలు తన వీకెండ్ కాలమ్ లో చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ ని మొదటి నుంచి దెబ్బతీస్తుంది అనుకూలంగా మాట్లాడుతూనే గోతులు తవ్వుతున్న టీడీపీ అనే విషయం రాజకీయ వర్గాలలో అందరికి తెలుసు. చివరికి జనసైనికులకి కూడా తెలుసు. కాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం మాత్రం ఎవరికి అర్ధం కాని ప్రశ్నగా ఇప్పుడు ఉండిపోయింది.